సాంకేతిక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ప్రతిఒక్కరి చేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఫోన్ వాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, యాట్యూబ్ లాంటివి ప్రతిరోజూ చూడటం ఒక అలవాటుగా మారిపోయింది. చాలామంది గంటల తరబడి సోషల్ మీడియాలోనే సమయాన్ని గడపుతున్నారు. అంతేకాదు ఈ మధ్య చిన్నపిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. ఫోన్ ఇస్తేనే తల్లిదండ్రులు చెప్పిన పనిని వారు వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు స్మార్ట్‌ఫోన్లు వాడుతూనే ఉన్నారు. అయితే ఫోన్‌లో సోషల్ మీడియా వాడకంపై ఓ నివేదిక కీలక విషయాలు బయటపెట్టింది. ఇండియా సాంకేతిక రంగంలో రోజు రోజుకు ముందుకు వెళ్తున్న తరుణంలో భారతీయులు ప్రతిరోజూ సగటున 194 నిమిషాల వరకు అంటే దాదాపు 3 గంటల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో గడుపుతున్నట్లు నివేదిక వెల్లడించింది. అయితే ఇందుకు సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ నివేదికల ప్రకారం సగటున ఇండియన్స్ దాదాపు 46 నిమిషాల వరకు ఆన్‌లైన్ గేమ్‌లలోనూ.. అలాగే ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లపై సుమారు 44 నిమిషాలు ఇలా తమ సమయాన్ని గడపుతున్నట్లు వెల్లడైంది. అయితే ఈ డేటా 2.06 మిలియన్ల వినియోగదారుల నుంచి యాప్‌లోని డేటా ఆధారంగా విడుదల చేశారు. అయితే ఇందులో తెలిసిందేంటంటే మొత్తం 100 శాతం సోషల్ మీడియా వినియోగం స్మార్ట్‌ఫోన్లు లేదా టాబ్లెట్ల ద్వారా జరుగుతున్నట్లు స్పష్టమైంది. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ కోసం 68 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లు/టాబ్లెట్‌లను వాడుతున్నట్లు తేలింది. అలాగే 4 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత కంప్యూటర్‌లను వినియోగిస్తున్నట్లు తెలిసింది. ఇక 28 శాతం మంది టీవీ లేదా హోమ్ థియేటర్లను వాడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
మరో ముఖ్యవిషయం ఏంటంటే ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ ఖర్చు విషయానికి వస్తే.. సోషల్ మీడియా వినియోగదారులకు చాలావరకు ఉచితం అని నివేదిక తెలియజేసింది. కానీ వారు ఓటీటీ కంటెంట్‌పై నెలకు 201 రూపాయల నుంచి 400 రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు పేర్కొంది. అదే విధంగా ఆన్‌లైన్ గేమింగ్స్ విషయానికి వస్తే వీటికోసం నెలకు 1000 రూపాయల కంటే తక్కువ చెల్లిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్ ధరలను గనుక ఒకవేళ 30 శాతం పెంచినట్లైతే.. 71 శాతం మంది గేమర్‌లు, 17 శాతం మంది ఓటీటీ ప్రేక్షకులు తమ సమయాన్ని తగ్గించుకునే అవకాశం ఉందని నివేదికలు తెలిపాయి. మరో విషయం ఏంటంటే రాబోయ్యే రోజుల్లో ఇంకా సోషల్ మీడియా వినియోగదారులు ఇంకా ఎక్కువగా పెరుగుతూనే ఉంటారని వెల్లడించాయి.