రాత్రి సమయంలో నిద్ర పట్టక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఉదయం అంతా పనిచేసి.. రాత్రి ప్రశాంతంగా పడుకుని మళ్లీ ఉదయం పనికి వెళ్దామని అంతా అనుకుంటారు. కాని అనుకున్నట్లుగా కొందరికి సుఖంగా నిద్ర పట్టదు. వాస్తవానికి ఆరోగ్యవంతమైన జీవితం కోసం కనీసం 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట తగినంత నిద్రపోవడం వల్ల స్లీప్ అప్నియా, యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి రుగ్మతల నుంచి దూరంగా ఉండవచ్చు. నిర్ణీత సమయం నిద్ర పోకపోతే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వ్యక్తి వృత్తిపరమైన జీవితంలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలంటే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఆరోగ్యవంతమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం. అయితే చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. కొంతమంది అయితే టాబ్లెట్స్ కూడా వాడుతుంటారు. అయితే నిద్రకోసం టాబ్లెట్స్ ను ఎంచుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఆధారంగా వైద్యుల సూచన మేరకు మాత్రమే అవసరమైనప్పుడు మినహా మిగిలిన సమయాల్లో నిద్ర కోసం మాత్రలు వేసుకోకూడదని సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ప్రశాంతంగా.. సుఖంగా నిద్రపోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఇలా చేయడం వల్ల అలసట తొలగిపోయి, మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. స్నానం చేసిన తర్వాత రాత్రిపూట చాలా ప్రశాతంగా ఉంటుంది. సుఖంగా నిద్రపోవచ్చు.
రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలు తాగాలని వైద్యులు చెబుతున్నారు. పాలలో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది పగటిపూట అలసట నుండి ఉపశమనం పొందడం ద్వారా మంచి నిద్రను పొందడంలో సహకరిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే రాత్రి ప్రశాంతంగా నిద్రపోవడానికి పడుకునేముందు పాలు తీసుకోవడం మంచిదని సిఫార్సు చేస్తున్నారు.
రాత్రి పడుకునే ముందు అరికాళ్లను 2 నుంచి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అరికాళ్ల ఆక్యుప్రెషర్ పాయింట్లపై నూనెను మసాజ్ చేయడం వల్ల చాలా రిలాక్స్‌గా ఉంటుందని, మంచి నిద్రకు సహాయపడుతుంది.
నిద్రవేళకు ముందు రాత్రి భోజనంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోకూడదు. ఇది జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. మెరుగైన జీర్ణక్రియ ఉండాలంటే రాత్రిపూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. దీంతో చక్కటి నిద్ర పడుతుంది. మనం తినే ఆహారం మన నిద్రపై ప్రభావం చూపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు ఫోన్, ల్యాప్‌టాప్, టీవీకి దూరంగా ఉండాలి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మెదడు కణాలకు విశ్రాంతి లభించడం వల్ల రాత్రి బాగా నిద్రపడుతుంది. మరుసటి రోజు ఎనర్జీతో నిద్ర లేవడానికి వీలవుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..