
చెడు జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం, పొగతాగడం, మద్యం సేవించడం, వ్యాయామం చేయకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సరైన ఆహార నియమాలు పాటించకపోతే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో సహాయపడేందుకు.. మనం ఏయే ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాసెస్ చేసిన మాంసం, ఫ్రోజన్ స్నాక్స్, బర్గర్లు, హాట్‌డాగ్స్ వంటి పదార్థాలలో సోడియం, సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను పెంచుతాయి. కాబట్టి వీటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
గొర్రె, పంది, గొడ్డు మాంసం వంటి రెడ్ మీట్ లో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కాబట్టి వీటిని పూర్తిగా తినడం మానేయడం లేదా తగ్గించడం మంచిది.
బజ్జీలు, సమోసాలు, పకోడీలు వంటివి నూనెలో బాగా వేయించడం వల్ల వాటిలో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. వీటిని తరచుగా తినకుండా ఉండటం మంచిది.
కూల్‌డ్రింక్స్, మిఠాయిలు, తీపి పానీయాల వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇవి బరువు పెరగడానికి, కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి. పరోక్షంగా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తాయి.
చిప్స్, ఇన్‌స్టంట్ నూడుల్స్, రెడీ టు ఈట్ స్నాక్స్ వంటి ప్యాక్ చేసిన పదార్థాలలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కొలెస్ట్రాల్ సమస్య ఉన్న వారికి ఇవి ఏమాత్రం మంచివి కావు.
కేకులు, పేస్ట్రీలు, కుకీలు, డోనట్స్ వంటి బేక్ చేసిన స్వీట్స్ లో కేలరీలు, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడానికి ఈ ఆహారాలకు దూరంగా ఉండటంతో పాటు.. మంచి ఆహారపు అలవాట్లను, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. ఏవైనా మార్పులు చేసే ముందు మీ డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడి సలహా తీసుకోవడం అవసరం.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)