
మిస్ క్యారేజ్ తర్వాత జుట్టు ఎందుకు ఎక్కువగా రాలుతుందంటే.. గర్భధారణ సమయంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాన్ని నిలబెట్టడంలోనే కాకుండా.. జుట్టు పెరుగుదలపై కూడా ప్రభావం చూపుతాయి. గర్భ సమయంలో ఉండే అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలు జుట్టు పెరిగే దశను (anagen stage) పొడిగిస్తాయి. అయితే మిస్ క్యారేజ్ తర్వాత ఇవి ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల జుట్టు అకస్మాత్తుగా రాలిపోతుంది.
హార్మోన్ల మార్పు వల్ల జుట్టు రాలే ప్రక్రియను టెలోజెన్ ఎఫ్లూవియం (Telogen Effluvium) అంటారు. ఈ పరిస్థితిలో జుట్టు పెరుగుతున్న దశ నుంచి విశ్రాంతి దశలోకి (telogen) వెళ్లిపోతుంది. సాధారణంగా ఈ దశలో ఉండే జుట్టు 3 నుండి 6 నెలల తర్వాత రాలిపోతుంది. మిస్ క్యారేజ్ అనేది శరీరానికి అకస్మాత్తుగా కలిగే ఒక షాక్ లాంటిది. దీని వల్ల ఈ టెలోజెన్ ఎఫ్లూవియం సమస్య వస్తుంది.
మిస్ క్యారేజ్ భావోద్వేగపరంగా తీవ్రంగా కలచివేసే సంఘటన. దీని వల్ల ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ ఉత్పత్తి ఎక్కువవుతుంది. దీని ప్రభావంతో జుట్టు పెరుగుదల మందగిస్తుంది. అలాగే ఒత్తిడితో పాటు నిద్రలేమి, తినే అలవాట్లలో లోపం కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
గర్భం ఉన్న సమయంలో శరీరానికి ఎక్కువ పోషకాలు అవసరం. మిస్ క్యారేజ్ జరిగిన తర్వాత శరీరంలోని విటమిన్లు, మినరల్స్ నిల్వలు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఐరన్, బయోటిన్, బి గ్రూప్ విటమిన్లు, విటమిన్ డి వంటి లోపం జుట్టు రాలడానికి కారణమవుతాయి.
మిస్ క్యారేజ్ తర్వాత జుట్టు రాలడం ఎంతకాలం ఉంటుందంటే.. టెలోజెన్ ఎఫ్లూవియం (Telogen Effluvium) వల్ల వచ్చే జుట్టు రాలడం సాధారణంగా మిస్ క్యారేజ్ జరిగిన 3 నుంచి 6 నెలల తర్వాత మొదలవుతుంది. ఇది శరీరంలోని జుట్టు పెరుగుదల చక్రానికి అనుగుణంగా ఆలస్యంగా కనిపించవచ్చు. ఒకసారి జుట్టు రాలడం ప్రారంభమైతే.. అది 3 నెలల నుండి 6 నెలల వరకు కొనసాగవచ్చు. కొందరిలో ఈ కాలం ఎక్కువగా ఉండొచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, ఆహారం, ఒత్తిడి స్థాయి మీద ఆధారపడి ఉంటుంది.
పోషకాలతో సమతుల్య ఆహారం తీసుకోవాలి.. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను సక్రమంగా తీసుకోవడం ముఖ్యం. ప్రొటీన్లు (గుడ్లు, పప్పులు, కూరగాయలు, మాంసం), ఐరన్ (పాలకూర, కందులు, మాంసం), జింక్, బయోటిన్, విటమిన్లు A, C, D, E వంటివి పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
శరీరానికి తగినంత నీరు ఇవ్వాలి.. నిరంతరం నీరు త్రాగడం, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి.. ప్రతిరోజూ ధ్యానం, నడక, యోగా, లేదా ఇష్టమైన పనుల్లో పాల్గొనడం వంటివి మీ మనశ్శాంతికి ఉపయోగపడతాయి. అవసరమైతే కుటుంబ సభ్యుల సహాయం లేదా సైకాలజిస్టుల సహాయం తీసుకోవచ్చు.
జుట్టుపై హింసాత్మక చర్యలు వద్దు.. హీట్ అప్లియన్స్, కెమికల్ కలర్ లు, జుట్టు స్ట్రెయిటెనింగ్, టైట్ గా ఉండే హెయిర్ స్టైల్స్ వంటివి తాత్కాలికంగా ఆపేయండి. జుట్టు బలహీనంగా ఉన్నప్పుడు ఇవి మరింత నష్టాన్ని కలిగించవచ్చు.
జుట్టును మృదువుగా వాష్ చేయడం అలవాటు చేసుకోండి.. వేడి నీటితో తల కడగడం వల్ల తల చర్మంలోని సహజ నూనె పోయి జుట్టు బలహీనమవుతుంది. గోరువెచ్చని నీటితో తల కడగాలి. తడిగా ఉన్న జుట్టును వెంటనే దువ్వకుండా.. ఆరిన తర్వాత మృదువుగా దువ్వుకోవాలి.
తలకు ఆయిల్ మసాజ్ ప్రయోజనకరం.. వారానికి రెండు సార్లు కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరిచే సహజ మార్గం.
మిస్ క్యారేజ్ తర్వాత జుట్టు రాలడం సహజమే. కానీ ఇది ఎక్కువకాలం కొనసాగితే లేదా పెరుగుదల తిరిగి రాకపోతే.. డెర్మటాలజిస్టును సంప్రదించడం మంచిది. వారు మీకు అవసరమైన చికిత్సలు, పోషకాలకు సంబంధించిన సప్లిమెంట్లు లేదా మినోక్సిడిల్ వంటి మందులు సూచించగలరు.