
మటన్ బొక్కలు తినడం వల్ల దంతాలకు హాని కలుగుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. చాలామంది మటన్ బొక్కలు, ముఖ్యంగా మూలగ బొక్కలను తినడానికి ఆసక్తి చూపుతారని, అయితే ఇది పళ్ల ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదం అని హెచ్చరించారు. పంటికి ఒక నిర్దిష్టమైన దృఢత్వం ఉంటుంది. ఎముకలు లాంటి అధిక దృఢత్వం కలిగిన పదార్థాలను క్రమం తప్పకుండా నమలడం వల్ల పన్ను అరిగిపోవడం లేదా పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. ఒకసారి పన్నుకు పగులు ఏర్పడితే అది మళ్లీ అతుక్కోదు. పగులు తీవ్రతను బట్టి పన్నును ఉంచాలా, లేదా తీసివేయాలా అనేది నిర్ణయించాల్సి వస్తుంది. ఇప్పటికే రూట్ కెనాల్ చికిత్స చేయించుకుని, క్యాప్స్ వేసుకున్న వారు ఎముకలను నమిలితే పన్ను విరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని నిపుణులు స్పష్టం చేశారు. అలాంటి సందర్భాలలో అధిక దృఢత్వం కలిగిన పదార్థాలను పూర్తిగా నివారించడమే శ్రేయస్కరం అని సలహా ఇస్తున్నారు. ఎముకలను డైరెక్టుగా కొరకడానికి బదులు సూప్ రూపంలో తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
ఇది కేవలం మటన్ బొక్కలకే కాకుండా, చికెన్ లాంటి ఇతర ఎముకలకు కూడా వర్తిస్తుందని డాక్టర్లు తెలిపారు. మన సహజ పళ్లు జీవితాంతం ఉండాలి అనేది చాలా ముఖ్యమని, కృత్రిమ ఇంప్లాంట్లు, క్రౌన్లు లేదా క్యాప్స్ లాంటివి సహజ పళ్లకు సరితూగవని చెప్పారు. పళ్లు తినడానికి, నవ్వడానికి, నమలడానికి జీవితాంతం సహాయపడతాయని అన్నారు. నాన్-వెజ్ ఆహార పదార్థాలలో ఉండే మెత్తటి భాగం పళ్ల మధ్య ఇరుక్కుపోవడం కూడా దంత సమస్యలకు మొదటి సంకేతమని డాక్టర్ పేర్కొన్నారు. పళ్ల మధ్య ఆహారం ఇరుక్కుంటున్నట్లయితే, చిగుళ్లు కిందికి జారుతున్నాయని, పళ్ల మధ్య ఖాళీ ఏర్పడి బ్యాక్టీరియా వృద్ధి చెంది చిగుళ్ల డ్యామేజ్ కొనసాగుతుందని అర్థం. ఇలాంటి సందర్భంలో వెంటనే దంత వైద్యుని సంప్రదించడం అవసరం.
ఖరీదైన, గట్టి క్యాప్స్ పెట్టుకున్న వారు కూడా ఎముకలను నమలడం వల్ల పళ్లకు నష్టం జరగదని భావించడం అపోహ అని అన్నారు. క్యాప్స్ ఎంత ఖరీదైనవి లేదా గట్టివి అయినా, అవి లోపల ఉన్న సహజ పంటిపైనే ఆధారపడి ఉంటాయని, కాబట్టి లోపలి పన్ను విరిగే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. నాన్-వెజ్ తినడం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, కానీ అధిక దృఢత్వం కలిగిన ఎముకలను కొరకడం మానుకోవాలని ఆయన స్పష్టం చేశారు. అనేకమంది రోగులు ఎముకలు కొరికి పళ్లు పోగొట్టుకున్నారని, క్యాప్స్ విరిగిపోవడం, పళ్లు అరిగిపోవడం, విరిగిపోవడం లాంటి సమస్యలతో తన వద్దకు వస్తారని డాక్టర్ చరణ్ తెలిపారు. ప్రజలలో దంత ఆరోగ్యం పట్ల అవగాహన లోపించడం, నొప్పి వచ్చేంతవరకు వేచి చూడటం, చికిత్సకు సమయం కేటాయించకపోవడం, దంత చికిత్సలు ఖరీదైనవి కావడం లాంటివి దంత నిర్లక్ష్యానికి కారణాలని ఆయన వివరించారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.