
చిన్న పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నారో క్షణం పాటు గమనించకపోయినా పెద్ద ప్రమాదమే జరగవచ్చు. ముఖ్యంగా ఏడాది వయస్సు పైబడిన పిల్లలు ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారు. ఈ క్రమంలో వారు నాణేలు, గోలీలు, పిన్నులు లేదా బ్యాటరీలను మింగడం ప్రాణాపాయానికి దారితీస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. న్యూఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం అధిపతి డాక్టర్ అనిల్ అరోరా తెలిపిన వివరాల ప్రకారం.. ఆరు నెలల తర్వాత పిల్లలు తమ పరిసరాలను గుర్తించే క్రమంలో నోటిని ఉపయోగిస్తారు. అందుకే చేతికి అందిన ప్రతి వస్తువును నోట్లో పెట్టుకోవడం ఒక సహజ ప్రక్రియ. కానీ ఇదే సమయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
బటన్ బ్యాటరీలు: ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. వీటిలో ఉండే సీసం కడుపులో కరిగిపోతే విషంగా మారుతుంది. ఇది ప్రాణాలు తీయవచ్చు.
అయస్కాంతాలు: అయస్కాంత ముక్కలు మింగితే అవి పేగులు ఒకదానికొకటి అతుక్కుపోయేలా చేస్తాయి. వీటిని తొలగించడం వైద్యులకు కూడా కష్టమవుతుంది.
పదునైన వస్తువులు: పిన్నులు, సూదులు అన్నవాహికలో లేదా గొంతులో గుచ్చుకుని తీవ్ర రక్తస్రావానికి కారణమవుతాయి.
నాణేలు, గోళీలు: ఇవి శ్వాసనాళాన్ని అడ్డుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
మీ బిడ్డ ఆడుకుంటూ ఉన్నట్టుండి ఈ లక్షణాలు చూపిస్తే వెంటనే అప్రమత్తమవ్వండి..
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం.
ఆగకుండా ఏడవడం లేదా ఉక్కిరిబిక్కిరి అవ్వడం.
అకస్మాత్తుగా వాంతులు చేసుకోవడం.
వస్తువు గొంతులో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తే.. బిడ్డను ముందుకి వంచి వీపుపై సున్నితంగా తట్టాలి. దీనివల్ల వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.
అస్సలు చేయకూడని పని: మీ చేతులతో లేదా వేళ్లతో నోటిలోని వస్తువును తీయడానికి ప్రయత్నించకండి. దీనివల్ల ఆ వస్తువు మరింత లోపలికి వెళ్లే ప్రమాదం ఉంది.
వైద్య సహాయం: ఏదైనా మింగిన 4-6 గంటల లోపు ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. దీనివల్ల ఆ వస్తువు కడుపులోని ద్రవాల్లో కలిసిపోకముందే ఎండోస్కోపీ ద్వారా సులభంగా తొలగించవచ్చు.
వస్తువు అన్నవాహికలో ఉంటే ఎండోస్కోపీ ద్వారా కొన్నిసార్లు పదునైన వస్తువులను విచ్ఛిన్నం చేయడానికి లేజర్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఒకవేళ వస్తువు ప్రేగులకు చేరితే శస్త్రచికిత్స తప్పనిసరి కావచ్చు. పిల్లల దగ్గర బ్యాటరీలతో నడిచే బొమ్మలు, చిన్న చిన్న నాణేలు లేకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని మర్చిపోవద్దు.