Diabetes: కాలం మారుతున్నకొద్ది కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతమున్న జీవనశైలి కారణంగా మానవునికి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఇక దేశంలో డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. వృద్దుల్లో మధుమేహం ఎలా ఉంటుంది..? దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే కోణంతో కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. 70 నుంచి 80 ఏళ్ల వయసు కలిగిన వృద్ధులు నిత్యం నడవడం ద్వారా టైప్-2 డయాబెటిస్ సమస్యను తగ్గించుకోవచ్చని అధ్యయనం ద్వారా తేల్చారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు డయాబెటిస్ కేర్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి.
65 ఏండ్లు దాటిన వృద్ధులపై పరిశోధన..
ఒక వృద్ధుడు లేదా వృద్ధురాలు తను రోజూ నడిచేదానికంటే ఒక వెయ్యి అడుగులు ఎక్కువ నడిస్తే మధుమేహం రిస్క్ 6 శాతం తగ్గుతుందని నిపుణులు తెలిపారు. అందువల్ల రోజుకు 2000 అడుగులు అదనంగా నడవగలిగితే టైప్-2 డయాబెటిస్ రిస్క్ 12 శాతం తగ్గుతుందని తేల్చారు. అయితే మధుమేహం లేని 65 ఏండ్ల పైబడిన వృద్ధులను ఈ పరిశోధన కోసం ఎంచుకున్నారు శాస్త్రవేత్తలు. వారి కుడి తుంటిపై యాక్సిలరోమీటర్‌లను అమర్చి పరిశీలించారు. వారంరోజులపాటు రోజూ 24 గంటలచొప్పున వాటిని తీయకుండా ఉంచుకోవాలని వారికి సూచించారు పరిశోధకులు. ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించారు. ప్రతి రోజు ఎక్కువ నడిచిన వారిలో టైప్-2 డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య తగ్గింది. చాలా తక్కువ నడక నడిచిన వారు డయాబెటిస్ బారిన పడ్డారు. వృద్దుల్లో డయాబెటిస్‌కు, నడకకు సంబంధం ఉందని స్పష్టం చేశారు. ఈ అధ్యయనం మొత్తం 4,838 మందిపై జరుగగా, వారిలో 395 మంది అంటే 8 శాతం మంది డయాబెటిస్ బారినపడ్డారు.
ప్రతి యేటా మధుమేహం బారిన 15 లక్షల మంది:
అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొత్తగా 15 లక్షల మంది డయాబెటిస్ బారినపడుతున్నారు. అందులో దాదాపు 5 లక్షల మంది 70 ఏండ్లు దాటిన వృద్ధులే ఉంటున్నారు. అందుకే వృద్ధులంతా రోజుకు కనీసం 2000 అడుగుల చొప్పున నడిస్తే వారిలో మధుమేహం రిస్క్ 12 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం చేసిన పరిశోధకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: