
అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారం.. 11 ఏళ్ల లోపు పిల్లల్లో దాదాపు 3 శాతం అమ్మాయిలు.. 1 శాతం అబ్బాయిలు తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా UTIతో బాధపడతారు. పుట్టిన తొలి నెలల్లో ముందోలు తీసివేయని (uncircumcised) అబ్బాయిల్లో ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. ఒక ఏడాది దాటిన తర్వాత అమ్మాయిల్లో UTI వచ్చే అవకాశాలు పెరుగుతాయి. జ్వరం ఉన్న పిల్లల్లో 2.9 శాతం నుంచి 7.5 శాతం కేసుల్లో UTI కారణం కావచ్చు. సరైన సమయంలో చికిత్స అందకపోతే.. ఇది కిడ్నీ స్కారింగ్ (kidney scarring), అధిక రక్తపోటు వంటి ప్రమాదకరమైన సమస్యలకు దారితీయవచ్చు.
పిల్లల్లో UTI లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. డాక్టర్లు యూరిన్ శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తారు. అవసరమైతే చిన్న ట్యూబ్ సాయంతో శాంపిల్ తీసుకోవచ్చు. ఆ శాంపిల్‌లో బ్యాక్టీరియా ఉందా లేదా అనేది రెండు రోజుల్లో తెలుస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే యాంటీబయోటిక్స్ వాడాలి. లక్షణాలు తగ్గినప్పటికీ.. డాక్టర్ చెప్పినట్లుగా కోర్సు మొత్తం కచ్చితంగా పూర్తి చేయాలి.
మూత్రపిండాలు, యూరెటర్స్ లేదా మూత్రాశయంలో బ్యాక్టీరియా చేరడం వల్ల UTI వస్తుంది. శరీరం కొన్నిసార్లు వాటిని సహజంగా తొలగించగలిగినప్పటికీ.. కుదరనప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది. సరైన శుభ్రత, తగినంత నీరు, ఇతర జాగ్రత్తలతో పిల్లల్లో UTIని నివారించవచ్చు.