ఈ సింపుల్ టెస్టులతో మీ కిడ్నీల ఆరోగ్యం గుట్టు రట్టు.. అసలు స్కాన్ ఎప్పుడు తీయించాలో తెలుసా..?

కిడ్నీల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి రక్త, మూత్ర పరీక్షలు కీలకం. ఇవి కిడ్నీ పనితీరును వెల్లడిస్తాయి. అయితే, రాళ్ళు, కణితులు, అడ్డంకులు వంటి నిర్మాణ సమస్యల నిర్ధారణకు అల్ట్రాసౌండ్ లేదా సిటి స్కాన్ వంటి ఇమేజింగ్ అవసరం. ఈ రెండు రకాల పరీక్షల ద్వారా ముందస్తుగా సమస్యలను గుర్తించి, దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిని నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ సింపుల్ టెస్టులతో మీ కిడ్నీల ఆరోగ్యం గుట్టు రట్టు.. అసలు స్కాన్ ఎప్పుడు తీయించాలో తెలుసా..?
Kidney Function Test

Updated on: Nov 18, 2025 | 6:08 PM

మూత్రపిండాల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సాధారణ రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు సరిపోతాయా? అల్ట్రాసౌండ్ లేదా సిటి స్కాన్ వంటి ఇమేజింగ్‌లు ఎప్పుడు అవసరం? ఈ సందేహంపై వైద్య నిపుణులు కీలక విషయాలను వెల్లడించారు. కిడ్నీ పనితీరు అంచనా వేయడానికి రక్త పరీక్షలు, కిడ్నీ నిర్మాణ సమస్యలు తెలుసుకోవడానికి ఇమేజింగ్ అవసరమని వారు స్పష్టం చేశారు.

సాధారణ పరీక్షల ప్రాముఖ్యత

ముంబై సెంట్రల్‌లోని వోకార్డ్ హాస్పిటల్స్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ భాసిన్ ప్రకారం.. మూత్రపిండాల ఆరోగ్యాన్ని సమర్థవంతంగా అంచనా వేయడానికి సాధారణ రక్త, మూత్ర పరీక్షలు మొదటి, అతి ముఖ్యమైన దశ.

రక్త పరీక్షలు: సీరం క్రియేటినిన్ స్థాయి, eGFR కిడ్నీలు రక్తం నుండి వ్యర్థాలను ఎంత బాగా ఫిల్టర్ చేస్తున్నాయో తెలిపే కీలక సూచికలు.

మూత్ర పరీక్షలు: మూత్రంలో ప్రోటీన్ లేదా రక్తం ఉందో లేదో గుర్తించడంలో సహాయపడతాయి. ఇవి తరచుగా మూత్రపిండాల వ్యాధికి ప్రారంభ సంకేతాలుగా ఉంటాయి.

ఇమేజింగ్ ఎప్పుడు అవసరం?

రక్తం, మూత్ర పరీక్షలు మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉందని సూచిస్తాయి. కానీ దానికి కారణం ఏమిటో చెప్పలేవని థానేలోని KIMS హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజీ డాక్టర్ మహేష్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంలోనే అల్ట్రాసౌండ్ లేదా CT స్కాన్‌లు వంటి ఇమేజింగ్ పద్ధతులు ఉపయోగపడతాయి.

నిర్మాణ సమస్యలు: ఈ స్కాన్‌లు మూత్రపిండాల లోపలి నిర్మాణాన్ని పరిశీలించి, రాళ్ళు, తిత్తులు, కణితులు, అడ్డంకులు లేదా పుట్టుకతో వచ్చే అసాధారణతలు వంటి నిర్మాణాత్మక కారణాలను గుర్తించడంలో సహాయపడతాయని మహేశ్ అన్నారు.

మొదటి అడుగు కాదు

ఇమేజింగ్ ఎల్లప్పుడూ మొదటి అడుగు కాదని డాక్టర్ భాసిన్ అన్నారు. ఎందుకంటే పనితీరు తగ్గినప్పటికీ, ఈ స్కాన్‌లు కేవలం నిర్మాణాన్ని మాత్రమే చూపిస్తాయి కాబట్టి, కొన్నిసార్లు ఇమేజింగ్ సాధారణంగా కనిపించవచ్చు.

రెండు పరీక్షల పాత్ర

డాక్టర్ భాసిన్ – డాక్టర్ మహేష్ ఇద్దరూ కిడ్నీ మూల్యాంకనంలో రెండు పరీక్షల ప్రత్యేక పాత్రను స్పష్టం చేశారు:

రక్త పరీక్షలు: మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో అంచనా వేస్తాయి.

ఇమేజింగ్: మూత్రపిండాలు ఎందుకు సరిగ్గా పనిచేయడంలేదనే విషయాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది.

ఎవరికి స్కానింగ్ సూచించాలి?

మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు లేదా కుటుంబ చరిత్ర ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకోవాలి. అయితే పార్శ్వ నొప్పి, వాపు లేదా మూత్రంలో రక్తం వంటి నిర్దిష్ట లక్షణాలు ఉన్నప్పుడు లేదా రక్తం, మూత్ర పరీక్షల్లో అసాధారణత కనిపించినప్పుడు మాత్రమే ఇమేజింగ్ అవసరం ఉంటుందని డాక్టర్ మహేష్ తెలిపారు.

ఈ సాధారణ పరీక్షల ద్వారా ముందస్తుగా గుర్తించడం వలన దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధిని నివారించడంలో, భవిష్యత్తులో డయాలసిస్ అవసరాన్ని నివారించడంలో చాలా సహాయపడుతుందని నిపుణులు సూచించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..