Telugu News Health These seven Ayurvedic herbs can keep you healthy if used daily Telugu Health News
Ayurvedic Remedies : ఈ ఏడు ఆయుర్వేద మూలికలను రోజూ వాడితే, మీ లంగ్స్ ఉక్కులా మారడం ఖాయం..!!
పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులను తూట్లు పొడిచే విష వాయువుల ప్రభావంతో ఆస్తమా, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్ లాంటి వ్యాధులు ఇబ్బంది కలిగిస్తున్నాయి.
పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులను తూట్లు పొడిచే విష వాయువుల ప్రభావంతో ఆస్తమా, బ్రాంకైటిస్, లంగ్ క్యాన్సర్ లాంటి వ్యాధులు ఇబ్బంది కలిగిస్తున్నాయి. అయితే శ్వాసకోశ వ్యాధుల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఆయుర్వేదంలో శ్వాసకోశ వ్యాధులు రాకుండా అనేక పరిష్కారాలు ఉన్నాయి. అలాంటి చిట్కాలను తెలుసుకుందాం.
తులసి ఆకు: తులసి శ్వాసకోశ ఆరోగ్యానికి సంజీవని అని చెప్పవచ్చు. ప్రతిరోజూ మూడు నుండి నాలుగు తులసి ఆకులను తినడం వల్ల ఇన్ఫెక్షన్లు, సైనసైటిస్, దగ్గు, జలుబు వంటి వివిధ శ్వాసకోశ వ్యాధులను నివారించవచ్చు. ఇది శక్తివంతమైన ఇమ్యునోమోడ్యులేటర్ మాత్రమే కాదు. ఉబ్బసం, బ్రోంకైటిస్ చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. తులసిలో బలమైన యాంటీవైరల్ లక్షణాలు సైతం ఉండటం విశేషం.
త్రిఫల: త్రిఫల అనేది ఆయుర్వేదంలో సర్వరోగనివారిణిగా చెబుతుంటారు. ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. దీన్ని నీటిలో కలిపి నోట్లో వేసుకొని పుక్కిలించడం ద్వారా గొంతు ప్రాంతంలో సమస్య కలిగించే బ్యాక్టీరియా చనిపోతుంది. రోజు ఇలా చేయడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
నువ్వుల నూనె: ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో నువ్వుల నూనె అద్భుతమైనది. ఉదయం లేవగానే ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కల నూనె వేయండి. ఈ విధానాన్ని ఆయుర్వేదంలో నయాసా అంటారు. చుక్కలు మీ నాసికా మార్గాన్ని శుభ్రపరుస్తాయి.
తేనె: తేనె యాంటీ బ్యాక్టీరియా లక్షణాలతో అమృతం లాంటి రుచిని కలిగి ఉంటుంది. ప్రతిరోజూ తేనెను తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. తేనెలోని యాంటీ బాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో సహాయపడతాయి.
పిప్పల చూర్ణం: పిప్పల చూర్ణం సాధారణ శ్వాసకోశ సమస్యల చికిత్సలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది యాంటీ ఇరిటెంట్‌గా పనిచేస్తుంది. వాపును తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం క్లియర్ చేస్తుంది. ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది.
పసుపు, శొంఠి, దాల్చిన చెక్క పొడి: పసుపు, శొంఠి, దాల్చిన చెక్క పొడిని రోజూ తీసుకోవడం మీ ఊపిరితిత్తులను క్లియర్ చేయడానికి చక్కటి పరిష్కారం. ఈ మూడింటిని సమపాళ్లలో కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది.
అల్లం టీ: అల్లం టీ శ్వాసకోశం నుండి కాలుష్య కారకాలను తొలగించడంలో సహాయపడుతుంది. పొటాషియం, మెగ్నీషియం, జింక్ లాంటి మినరల్స్ అధికంగా ఉండే అల్లం టీ, రోగనిరోధక శక్తిని సృష్టించడంలో, సీజనల్ అనారోగ్యాలతో పోరాడడంలో మీకు సహాయపడుతుంది.
(నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.)