
రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి పెసర పప్పు చాలా మంచిది అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పెసలు తీసుకునే విధానం, దాని ప్రయోజనాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి. డయాబెటిస్ సమస్య ఉంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. చక్కెర స్థాయిలు నియంత్రించడానికి పప్పుధాన్యాలు కీలకం. వీటిలో ఫైబర్ అధికం. ఫైబర్ కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మది చేస్తుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
పోషకాలు: పెసర పప్పులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్-బి, పొటాషియం, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ: పచ్చి పెసల గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 38 మాత్రమే. ఇది చాలా తక్కువ. ఈ పప్పు నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరగదు.
ప్రోటీన్ వనరు: శాకాహారులకు పచ్చి పెసలు ప్రోటీన్‌కు మంచి వనరు. ఇది కండరాలను బలోపేతం చేయటానికి, శరీరాన్ని మరమ్మతు చేయటానికి సాయపడుతుంది.
బరువు నియంత్రణ: అధిక ఫైబర్ ఉండటం వలన ఎక్కువ కాలం కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది అతిగా తినకుండా నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి సాయపడుతుంది.
2015లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, పచ్చి పెసలు పొట్టుతో తయారు చేసిన బిస్కెట్లు డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయని తేలింది.
డయాబెటిస్ రోగులు పెసర పప్పును ఈ నాలుగు విధానాల్లో తీసుకోవచ్చు:
పెసరట్టు (దోశ): పెసర పప్పుతో దోశ వేసుకుని తినవచ్చు. పెసరట్టు మంచి అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) అవుతుంది. మిగతా మసాలా దినుసులతో కలిపి ఉడికించి కూడా తినవచ్చు.
మొలకెత్తిన పెసలు (Sprouts): వీటిని రాత్రి పూట నానబెట్టి, ఉదయం అల్పాహారంలో మొలకెత్తిన పెసలు తినండి. ఇది చక్కెరను నియంత్రించడంలో సాయపడుతుంది.
పెసర నీరు: పెసలు ఉడకబెట్టి ఆ నీటిని తాగండి. ఇది బలహీనతను తొలగిస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.
కిచిడి: పెసర పప్పుతో కిచిడి తయారు చేసి తినండి. ఇది తేలికగా, జీర్ణం అవ్వడానికి సులభంగా ఉంటుంది. డయాబెటిక్ డైట్‌కు చాలా అనుకూలం.
జీర్ణక్రియ: పెసల్లో ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గుండె ఆరోగ్యం: పచ్చి పెసల్లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, గుండె జబ్బులు నివారించడంలో సాయపడుతుంది.
రక్తహీనత: పచ్చి పెసర పప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పోషకాహార నిపుణుల సలహాపై ఆధారపడింది. డయాబెటిస్ రోగులు తమ ఆహారంలో ముఖ్యమైన మార్పులు చేసే ముందు ఎల్లప్పుడూ తమ వైద్యుడిని లేక పోషకాహార నిపుణుడిని సంప్రదించాలి.