ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అందరికీ తెలిసిన విషయమే. అలాగే రోజుకు కనీసం అరగంటైనా నడవడం చాలామంచిదని వైద్యులు చెబుతుంటారు. ఈ తరుణంలో అమెరికా, మెక్సికో శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. వ్యాయామంలో భాగంగా మధ్య వయస్సులో పరిగెత్తడం వల్ల వృద్ధాప్యంలో వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. యవ్వన దశలోకి వచ్చాక కొత్తగా ఏర్పడే నాడి కణాలను కీలక నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. వయసు మళ్లే కొద్ది ఎపిసోడిక్ మెమరీ నిర్వహణకు ఈ నెట్‌వర్క్ అవసరమని తెలిపారు.
వృద్ధాప్యం వల్ల విషయగ్రహణ సామర్థ్యం తగ్గుతుందని.. మెదడులోని హిప్పోక్యాంపల్ పరిమాణంలో మార్పులు ఇందుకు కారణమని చెప్పారు. అలాగే వార్ధక్యం వల్ల మెదడులోని పెరిహైనల్, ఎంట్రోహైనల్ కార్టెక్స్ నుంచి హిప్పోక్యాంపస్‌కు వచ్చే సమాచారం క్షీణించడం వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతుందని తెలిపారు. దీర్ఘకాలిక పరుగుల వల్ల.. యవ్వనంలో పుట్టుకొచ్చిన న్యూరాన్లు పెరగడంతోపాటు పెరిహైనల్ సంధానతలు బలోపేతమవుతున్నట్లు చెప్పారు. ఫలితంగా వృద్ధాప్యంతో వచ్చే జ్ఞాపకశక్తి క్షీణతను ఇవి దూరం చేసినట్లు వెల్లడించారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి