Brain Health: చిల్ బ్రో.. మానసిక ఒత్తిడి మెదడుకు మంచిదేనట.. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
తక్కువ నుంచి మధ్య స్థాయి ఒత్తిడి ప్రభావం కొందరు వ్యక్తులను మానసిక రుగ్మతల బారి నుంచి కాపాడుతుందని తాజా అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. అలాగే వ్యక్తి గుణగణాలను పెంపొందించడంలో సహాయపడడుతుందని వెల్లడించారు.
Brain Health: మానసిక ఒత్తిడి గురించి మనలో చాలా మంది మరీ ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు. ఒత్తిడికి గురికావడం వల్ల భవిష్యత్తులో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయోనని భయపడుతూ ఉంటాం.. అయితే ఇక ఆ భయం అవసరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు. ఒత్తిడి కారణంగా తల పేలిపోతుందేమోనని అనిపించవచ్చు.. కాని నిజానికి ఆ ఒత్తిడి మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుందనే విషయం తమ పరిశోధనలో తేలిందని తెలిపారు. తక్కువ నుంచి మధ్య స్థాయి ఒత్తిడి ప్రభావం కొందరు వ్యక్తులను మానసిక రుగ్మతల బారి నుంచి కాపాడుతుందని తేల్చారు. అలాగే వ్యక్తి గుణగణాలను పెంపొందించడంలో సహాయపడడుతుందని తేల్చారు. నిరాశ, సంఘ విద్రోహ ఆలోచనలు, మానసిక రుగ్మతలను కలిగించే ఆలోచనలు రాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే మరింత ఒత్తడిని ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకు చెందిన యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు.
ఒక వ్యక్తి మాదిరిస్థాయి ఒత్తిడి వాతావరణంలో ఉంటే ఆ వ్యక్తి మరింత ప్రభావంతంగా పనిచేయవచ్చని పరిశోధకులు, కాలేజ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ కన్స్యూమర్ సైన్సెస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ అసఫ్ ఓశ్రీ పేర్కొన్నారు. పరీక్షల కోసం చదువుతున్న వారు, పని ప్రదేశాల్లో పెద్ద, పెద్ద సమావేశాల్లో పాల్గొనడం, ఎక్కువ సమయం పనిచేయడం వంటివి ఆవ్యక్తి అభివృద్ధికి దారితీయవచ్చని.. లేదా తాను ప్రస్తుతం పనిచేస్తున్న రంగంలో కొనసాగాలో వద్దో నిర్ణయించుకోవడానికి దోహదపడుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఒత్తిడికి.. అధిక ఒత్తిడికి మధ్య తేడా ఉంటుందని అసఫ్ ఓశ్రీ తెలిపారు.
ఏదైనా కష్టంతో కూడిన పనిచేస్తున్నప్పుడు.. నిరుత్సాహంలో ఉన్నప్పుడు చర్మంపై కూడా ఆప్రభావం ఉంటుందని తెలిపారు. ఒత్తిడి మరీ తీవ్రమైనప్పుడు చర్మాన్ని కత్తిరించేయాలనే ఆలోచనలోకి కూడా వెళ్లిపోతారని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా లోని యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ కు నేతృత్వం వహిస్తున్న అసఫ్ ఓశ్రీ పేర్కొన్నారు. సానుకూలాంశాలతో కూడిన ఒత్తిడి భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా ఒక టీకాలా పనిచేస్తోందని యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది.
మానవ మెదడు ఎలా పనిచేస్తుందనే తెలుసుకునే లక్ష్యంతో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సమకూర్చిన నిధులతో ఈజాతీయ ప్రాజెక్టును చేపట్టారు. దాదాపు 1200 మంది యువకుల నుంచి డేటాను సేకరించి వారు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న పని ఒత్తిడి.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి వారేం చేస్తున్నారో మొదలైన వివరాల ఆధారంగా వచ్చిన ఫలితాన్ని యూత్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. ఒత్తిడి అంటే ఎప్పుడూ భయపడేవారికి ఈ అధ్యయనంలో వెల్లడించిన అంశాలు కాస్త ఊరట కలిగిస్తాయని చెప్పుకోవాలి.
ఫైనల్‌గా మీకు చెప్పేది ఏంటంటే.. పని ఒత్తిడి గురించి మరీ ఎక్కువగా ఆలోచిస్తూ బుర్రపాడు చేసుకోవడం కంటే.. వర్క్ ఫ్రజెర్‌తో ఫుట్‌బాల్ ఆడుకునేందుకు రెడీ అయిపోండి..
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..