AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Medicine Price: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఖరీదైన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఢమాల్‌!

బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ పేషెంట్లకు ఊరట కలిగించే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఖరీదైనదిగా భావించిన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో సాధారణ ప్రజలకు కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. షుగర్ కంట్రోల్ చేయడం, బరువు తగ్గడం ఈ రోజుల్లో చాలామందికి పెద్ద సవాల్‌గా మారిన నేపథ్యంలో, ఈ పరిణామం ఆరోగ్య రంగంలో కీలక మార్పుగా భావిస్తున్నారు..

Diabetes Medicine Price: షుగర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఖరీదైన ‘సెమాగ్లుటైడ్’ మందుల ధరలు ఢమాల్‌!
Semaglutide Price In India
Vijay Saatha
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 12:46 PM

Share

‘సెమాగ్లుటైడ్’ అనే ఈ ఔషధం అంతర్జాతీయంగా ‘ఓజెంపిక్’ పేరుతో ప్రాచుర్యం పొందింది. డయాబెటిస్ నియంత్రణతో పాటు బరువు తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మందుల ధర నెలకు సుమారు రూ.10,000 నుంచి రూ.16,000 వరకు ఉండటంతో, చాలా మంది పేషెంట్లు దీనిని కొనుగోలు చేయలేకపోయేవారు. ఇప్పుడేమైతే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భారత మార్కెట్లో ఈ మందుల జెనరిక్ వెర్షన్లు ప్రవేశించడంతో ధరలు ఒక్కసారిగా దాదాపు 60 శాతం తగ్గాయి. గతంలో వేలల్లో ఉన్న ఖర్చు ఇప్పుడు నెలకు సుమారు రూ.3,500 నుంచి రూ.4,000 మధ్యలోకి వచ్చేసింది. మార్చి 20న పేటెంట్ గడువు ముగియడంతో దేశీయ ఫార్మా కంపెనీలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వరుసగా మార్కెట్లోకి దిగుతున్నాయి.

ఈ రేసులో ప్రముఖ ఫార్మా కంపెనీలు పోటీపడుతున్నాయి. సన్ ఫార్మా ‘Noveltreat’, ‘Sematrinity’ పేర్లతో రెండు బ్రాండ్లను ప్రవేశపెడుతోంది. డాక్టర్ రెడ్డీస్ సంస్థ అవసరమైన అనుమతులు పూర్తి చేసుకుని వేగంగా మార్కెట్లోకి వచ్చేసింది. ల్యూపిన్ తమ విస్తృత వైద్య నెట్‌వర్క్ ద్వారా ఈ మందులను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మ్యాన్‌కైండ్ ఫార్మా ‘Samakind’ అనే బ్రాండ్‌తో చిన్న నగరాలను టార్గెట్ చేస్తోంది. జైడస్ కూడా మూడు బ్రాండ్లతో బలమైన పోటీ ఇస్తోంది. ఇప్పటికే భారత్‌లో GLP-1 మందుల మార్కెట్ విలువ రూ.1000 కోట్లను దాటింది. రాబోయే ఏడాదిలో ఇది రూ.5,000 కోట్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 50 బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. దీంతో ఈ సెగ్మెంట్‌లో భారీ పోటీ నెలకొనడం ఖాయం.

అయితే, ఇక్కడే ఒక ముఖ్యమైన సవాల్ కూడా ఉంది. ఈ మందులను తయారు చేయడం మాత్రమే కాకుండా, వాటిని సరైన విధంగా నిల్వ చేయడం, పేషెంట్లకు సురక్షితంగా అందించడం కూడా చాలా కీలకం. సెమాగ్లుటైడ్ మందులను తప్పనిసరిగా కోల్డ్ చైన్‌లో నిల్వ చేయాలి. నిల్వలో చిన్న పొరపాటు జరిగినా ఔషధం ప్రభావం తగ్గే ప్రమాదం ఉంది. అలాగే, ఈ మందులను అనుభవం ఉన్న ఎండోక్రినాలజిస్టులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మార్గదర్శకాలు లేకుండా వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమూ ఉంది. అందుకే వైద్యుల పర్యవేక్షణలోనే వినియోగించాలి. ఈ నేపథ్యంలో ల్యూపిన్ ఎండీ నీలేష్ గుప్తా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మార్కెట్లోకి ఎన్నో బ్రాండ్లు వచ్చినా, సరైన సప్లై చైన్, కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థ ఉన్న కంపెనీలే దీర్ఘకాలంలో నిలబడతాయని ఆయన అన్నారు. ఆరు నెలల తర్వాత ఈ పోటీలో చాలా కంపెనీలు బయటకు వెళ్లే అవకాశముందని కూడా పేర్కొన్నారు. మొత్తానికి, ఇప్పటి వరకు విదేశీ మందుల కోసం భారీగా ఖర్చు చేసిన భారతీయులకు ఇది పెద్ద ఉపశమనం. తక్కువ ధరల్లో సమర్థవంతమైన చికిత్స అందుబాటులోకి రావడం వల్ల డయాబెటిస్ మరియు ఒబెసిటీ బాధితులకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామంగా మారింది. మరిన్ని ఆరోగ్య సంబంధిత తాజా అప్డేట్స్ కోసం టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us