Child Care: మీ చిన్నారులు జాగ్రత్త.. ఇలా చేయకపోతే మయోపియా ముప్పు తప్పదు..!

ఒకప్పుడు అరవై ఏళ్లకు కానీ అద్దాలు వచ్చేవి కావు. కానీ నేడు ఆరేళ్లకే వస్తున్నాయి. పోషకాహార లోపమే కాదు.. మన నిర్లక్ష్యం కూడా పిల్లలకు శాపంగా మారుతోంది.

Child Care: మీ చిన్నారులు జాగ్రత్త.. ఇలా చేయకపోతే మయోపియా ముప్పు తప్పదు..!
Myopia In Children
Follow us

|

Updated on: Dec 02, 2022 | 10:10 PM

ఒకప్పుడు అరవై ఏళ్లకు కానీ అద్దాలు వచ్చేవి కావు. కానీ నేడు ఆరేళ్లకే వస్తున్నాయి. పోషకాహార లోపమే కాదు.. మన నిర్లక్ష్యం కూడా పిల్లలకు శాపంగా మారుతోంది. గారాబంతో కొందరు.. అలసత్వంతో మరికొందరు పేరెంట్స్‌ చూపుతున్న అశ్రద్ద.. చిన్నారుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. మరీముఖ్యంగా కోవిడ్‌ తర్వాత స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగిపోవడం.. పిల్లలను మయోపియా వ్యాధిన పడేస్తున్నాయి.

పెరిగిన స్క్రీన్‌ సమయం.. ప్రతీ ఒక్కరినీ సైట్‌కు దగ్గర చేస్తోంది. లేచింది మొదలు.. రాత్రి వరకు సెల్‌ఫోన్‌, టీవీ, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌లను చూస్తూ గడపడం పెరిగిపోయింది. దీంతో ఆ ప్రభావం కంటిపై పడుతోంది. స్క్రీన్‌ను చూస్తున్నంత సేపు.. రెప్పకూడా వేయడం లేదు. దీంతో కళ్లు పొడిబారిపోయి.. సమస్యలకు దగ్గర చేస్తున్నాయి.

ఒకప్పుడు కంటిచూపు మందగిస్తోందంటే.. ఏజ్‌ మీద పడుతోంది కదా అనేవారు. కానీ నేడు ఆ పరిస్థితులు లేవు. జీవనశైలిలో వచ్చిన మార్పులు.. మనిషి విధానాన్నే మార్చివేశాయి. అంతేకాదు శారీరక శ్రమ లేకుండా పోవడంతో రోగాలకు దగ్గరవుతూ వస్తున్నాము. అది ఇప్పుడు పిల్లలపై కూడా చూపుతోంది. దానికితోడు.. చదువుల పేర్లతో చిన్నారులు గంటల పాటు టీవీలు, సెల్‌ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇదే ఇప్పుడు మయోపియా సమస్య పెరగడానికి కారణంగా మారుతోంది.

ఇవి కూడా చదవండి

గతంలో ప్రతీ 100 మందిలో 5 నుంచి 10 మందికి మయోపియా ఉండేది. రాను రాను అది తీవ్రమవుతూ వస్తోంది. 2050 నాటికి ప్రతీ 10 మందిలో ఐదుగురికి కంటి సమస్య కామన్‌గా ఉంటుందన్న హెచ్చరికలు.. కలవరపెడుతున్నాయి. ప్రస్తుత డిజిటల్‌ ప్రపంచంలో పిల్లలు ఎక్కువ సేపు స్మార్ట్‌ఫోన్లతోనే గడుపుతున్నారు. ఆన్‌లైన్‌ గేమ్‌లు, యూట్యూబ్‌ వీడియోలంటూ స్క్రీన్ల నుంచి కండ్లను పక్కకు తిప్పడం లేదు. మొన్నటి వరకు కరోనాతో ఆన్‌లైన్‌ క్లాసులంటూ నెలల కొద్దీ మొబైఫోన్లనే వాడారు. దాంతో చిన్నారుల్లో కంటి సమస్యలు విపరీతంగా పెరిగినట్టుగా వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఆసియాలో దాదాపు 13 శాతం మంది పిల్లలు మయోపియాతో బాధపడుతున్నట్టు ఇటీవల ఎయిమ్స్‌ అధ్యయనంలో తేలగా.. తాజాగా ప్రముఖ ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ నిర్వహించిన మరో అధ్యయనంలో నివ్వెరపరిచే నిజాలు వెలుగుచూశాయి. ప్రతీ పదిమంది పిల్లల్లో ఐదుగురికి మయోపియా వచ్చే అవకాశముందన్న ఆ నివేదిక మరింత కలవరపెట్టేలా మారింది. పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు తేలింది. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మందిపై మయోపియా ప్రభావం చూపుతుందని అన్నారు. దీన్ని తొలిదశలోనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. కొన్నాళ్లకు పూర్తిగా కంటిచూపును కోల్పోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు.

పోషకాహార లోపం కూడా ఓ కారణంగా గుర్తించారు. ఉదయం సమయంలో సూర్యరశ్మికి దూరంగా ఉండడం, నిద్రలేమి సమస్యలూ ఇందులో భాగమేనన్నారు. చిన్నవయసులోనే మయోపియాకు గురైన పిల్లల్లో వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందని చెబుతున్నారు. దాదాపు 4 శాతం భారతీయ మయోపియా రోగులకు శాశ్వత చూపు పోయే ప్రమాదం ఉన్నట్టు ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ నిపుణులు చెప్పడాన్ని చూస్తే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకోవచ్చు. ఏదేని డిజిటల్‌ స్క్రీన్‌ను చూసే సమయంలో.. ప్రతీ 20 నిమిషాలకు 20 సెకండ్ల విరామం ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఆరుబయట కార్యక్రమాలకు ప్రోత్సహించడంతో.. సహజ సూర్యకాంతి పడేలా చూస్తే.. మయోపియాకు గురికాకుండా రక్షించుకోవచ్చని అంటున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..