కాఫీ, టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందుకే ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా సార్లు టీ తాగుతారు. ఇక ఆఫీసుల్లో, బయట ఎవరైనా కలిస్తే టీ, కాఫీలతో కబుర్లు చెప్పుకోవాల్సిందే. అయితే మెదడును, శరీరాన్ని ఉత్తేజపరిచే టీతాగడంలోనూ కొన్ని పరిమితులున్నాయి. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు టీ ఎక్కువగా తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగకూడదు. ముఖ్యంగా చాలామంది ఉదయాన్నే పరగడుపున టీ, కాఫీలు ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అలాగే ఎసిడిటీ, అజీర్తి సమస్యలున్న వారు ఖాళీ కడుపుతో టీ తాగితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇక ఖాళీ కడుపుతో టీ తాగితే అస్సలు ఆకలి అనిపించదు. కొందరైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయరు. దీనివల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తాయి.
ఖాళీ కడుపుతో వేడి వేడి చాయ్ తాగడం వల్ల పొట్టలో యాసిడ్ లెవెల్స్ పెరిగి, జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. తద్వారా అజీర్తి, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పిని తగ్గించుకునేందుకు చాలా మంది టీ తాగుతారు. ఇది నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ.. అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల బర్నింగ్ సెన్సేషన్, వాంతులు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే ఇది ఇతర ఉదర సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇక ఖాళీ కడుపుతో టీ తాగితే నోటి దుర్వాసన వస్తుంది. నోటి ఆరోగ్యం కూడా ప్రతికూలంగా మారుతుంది.
నిద్రలేమితో పాటు..
ఇక పొద్దుటి పూటే టీ తాగడం వల్ల డీహైడ్రేట్ అయ్యి, మలబద్ధకం వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొట్టలోని ద్రవాల యాసిడ్ బేస్, ఆల్కలీన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్‌తో దిగువ ఛాతీలో నొప్పి కలుగుతుంది. దీంతో గుండెల్లో మంట వస్తుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..