ఊపిరి ఆడట్లేదా..? అయితే లైట్ తీసుకోకండి.. ప్రాణాలకే ప్రమాదం..!
శ్వాస సంబంధ సమస్యలు చిన్నవి గా అనిపించినా.. కొన్ని సార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా మారుతాయి. కొన్ని కీలక సూచనలు, జాగ్రత్తలు పాటిస్తే.. ఇటువంటి సమస్యలను తొలిదశలోనే గుర్తించి నియంత్రించవచ్చు. ఈ విషయాన్ని ముందే తెలుసుకుని స్పందిస్తే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఊపిరి తక్కువగా రావడం ఒక్కోసారి గాలిలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉన్నప్పుడు.. జలుబు, దుమ్ము అలర్జీ, ఆస్తమా లాంటి సమస్యల కారణంగా కలగవచ్చు. అయితే ఇది తాత్కాలికమా లేదా దీర్ఘకాలికమా అనేది గుర్తించడం ముఖ్యం. ఆ అవగాహనతోనే మనం సరైన చర్యలు తీసుకోవచ్చు. వెంటనే ప్రయత్నించాల్సిన ఇంటి పరిష్కారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిటారుగా కూర్చోవడం.. శ్వాస ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నెమ్మదిగా నేరుగా కూర్చోవాలి. ఇది ఊపిరితిత్తులకు విశ్రాంతి ఇచ్చి శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
లోతుగా శ్వాస తీసుకోవడం.. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకుని అదే విధంగా మెల్లగా వదిలేయండి. ఇది శ్వాస తీసుకోవడాన్ని సుగమం చేస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది.
గోరువెచ్చటి నీరు తాగడం.. శరీరంలోని చలిని తగ్గించడంలో గోరువెచ్చటి నీరు మంచి సహాయంగా ఉంటుంది. ఇది శ్లేష్మాన్ని కరిగించి ఊపిరితిత్తులకు ఉపశమనం కలిగిస్తుంది.
గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో ఉండండి.. తాజా గాలి అందే ప్రదేశంలో ఉండటం వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది. మూసివున్న గదుల్లో ఉండటం వల్ల మరింత అసౌకర్యం కలగవచ్చు.
ఒత్తిడిని తగ్గించడానికి చల్లటి నీటితో ముఖాన్ని కడగడం మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.
అవసరమైతే ఇన్హేలర్ వాడండి.. ఆస్తమా లేదా ఇతర శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచనల ప్రకారం ఇన్హేలర్ వాడాలి. ఇది తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.
ఇంటి పరిష్కారాలతోనూ ఉపశమనం లేకపోతే.. అసలు కారణం అలర్జీ, గుండె సంబంధిత సమస్య లేదా శ్వాసనాళాల లోపమేనా అని నిర్ధారించడానికి వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. ఆలస్యం ప్రాణాంతకంగా మారవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)