కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు ముసలిది అయిపోతది..

తాజా పరిశోధనల ప్రకారం.. వయస్సుతో పాటు శరీరంలోని కండరాలు, కొవ్వు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా విసెరల్ కొవ్వు మెదడును వేగంగా ముసలిది చేస్తుంది. అయితే కండర ద్రవ్యరాశి దానిని యవ్వనంగా ఉంచుతుంది. కండరాలను కోల్పోకుండా విసెరల్ కొవ్వును లక్ష్యంగా చేసుకునే చికిత్సలు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కీలకం.

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు ముసలిది అయిపోతది..
Healthy Brain Tips

Updated on: Dec 21, 2025 | 11:01 AM

సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనితీరు మందగించడం సహజమని మనం భావిస్తుంటాం. కానీ మన మెదడు ఎంత వేగంగా ముసలిదవుతుందో నిర్ణయించేది కేవలం వయస్సు మాత్రమే కాదు.. మన శరీరంలోని కండరాలు, కొవ్వు అని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రేడియోలాజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా వార్షిక సమావేశంలో సమర్పించిన ఒక అధ్యయనం ప్రకారం.. శరీర ఆకృతికి మెదడు వయస్సుకు మధ్య షాకింగ్ సంబంధం బయటపడింది.

ఏమిటీ అధ్యయనం?

మిస్సోరీలోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు సుమారు 1,164 మంది ఆరోగ్యవంతులైన వ్యక్తులపై MRI స్కాన్ల ద్వారా ఈ అధ్యయనం నిర్వహించారు. ఏఐ అల్గోరిథంలను ఉపయోగించి వారి కండరాల పరిమాణం, కొవ్వు స్థాయిలు, మెదడు వయస్సును లెక్కించారు.

పరిశోధనలో తేలిన ముఖ్యాంశాలు

విసెరల్ కొవ్వు: చర్మం కింద ఉండే కొవ్వు కంటే, మన శరీర లోపల అవయవాల చుట్టూ పేరుకుపోయే విసెరల్ కొవ్వు అత్యంత ప్రమాదకరమని తేలింది. ఈ కొవ్వు ఎంత ఎక్కువగా ఉంటే మెదడు అంత వేగంగా ముసలిదవుతున్నట్లుగుర్తించారు.

కండరాల ప్రాముఖ్యత: శరీరంలో కండర ద్రవ్యరాశి ఎక్కువగా ఉన్నవారిలో మెదడు చాలా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.

కండరాలు vs కొవ్వు నిష్పత్తి: కండరాలతో పోలిస్తే పొట్ట కొవ్వు ఎక్కువగా ఉన్నవారికి అల్జీమర్స్, ఇతర మెదడు సంబంధిత వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుందని డాక్టర్ సైరస్ రాజి హెచ్చరించారు.

బరువు తగ్గించే మందులపై హెచ్చరిక!

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఓజెంపిక్ వంటి బరువు తగ్గించే మందుల గురించి పరిశోధకులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మందులు కొవ్వును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ, అవి కండరాల నష్టానికి దారితీయవచ్చు. కండరాలు కోల్పోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, కాబట్టి కండరాలు తగ్గకుండా కేవలం విసెరల్ కొవ్వును మాత్రమే లక్ష్యంగా చేసుకునే చికిత్సలు అవసరమని పరిశోధన సూచించింది.

మెదడు వయస్సు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?

మెదడు చురుగ్గా, యవ్వనంగా ఉండాలంటే కేవలం ఆహారం తగ్గించడం సరిపోదు..

స్ట్రెంగ్త్ ట్రెయినింగ్: కండరాలు పెరగడానికి వ్యాయామాలు చేయాలి.

పొట్ట కొవ్వును కరిగించడం: ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా అవయవాల చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును తగ్గించాలి.

రెగ్యులర్ చెకప్స్: ఎంఆర్ఐ, ఏఐ అంచనాల ద్వారా మెదడు ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..