Mother Feed: అసలే మాయదారి కరోనా పెచ్చురిల్లుతున్న కాలం. పెద్దలకంటే వ్యాక్సీన్లు వచ్చాయి. మరి చిన్న పిల్లల పరిస్థితి ఏంటి?. కరోనా నేపథ్యంలో చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పిల్లల్లో రోగ నిరోధక శక్తి అధికంగా ఉండటం చాలా కీలకం అంటున్నారు. ముఖ్యంగా అప్పుడే పుట్టిన పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు. పుట్టిన తరువాత కనీసం ఆరు నెలల వరకు పిల్లలకు తల్లి పాలను మాత్రమే అందించాలని ఉద్ఘాటిస్తున్నారు. ఈ సమయంలో ప్యాకెట్ పాలు గానీ, ద్రవ, ఘన ఆహార పదార్థాలు తినిపించడం గానీ చేయొద్దంటున్నారు. శిశువుకు తల్లి పాలను మించిన టీకా లేదంటున్నారు. తల్లి పాలే శిశువుకు టీకా కన్నా మెరుగ్గా పని చేస్తుందని, అనేక వ్యాధుల నుంచి రక్షింస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.
తల్లి పాల నుంచి అవసరమైన అన్ని పోషకాలు శిశువు నుంచి లభిస్తాయని రోజ్ వాక్ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ షైలీ సింగ్ చెబుతున్నారు. వైద్యులు ఇంకా ఏం చెప్పారంటే.. పాలు ఇచ్చే, పాలు ఇవ్వని మహిళల మధ్య జరిపిన తులనాత్మక అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఒక సంవత్సరానికి పైగా పిల్లలకు పాలు పట్టే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. వాస్తవానికి అప్పుడే పుట్టిన బిడ్డకు పుట్టినప్పటి నుంచి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. దీని వల్ల వారు అతిసారం, పోషకాహార లోపం, న్యూమోనియా మొదలైన వాటి బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే పుట్టినప్పటి నుంచి శిశువు ఆరు నెలలు పెరిగేంత వరకు తల్లి పాలు ఇవ్వడం చాలా ముఖ్యం. తల్లి పాలు శిశును అన్ని రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
తల్లి పాలలో యాంటీబాడీస్..
ఢిల్లీలోని లోక్‌నాయక్ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ ప్రీతి సింగ్ మాట్లాడుతూ.. తల్లి పాలలో యాంటీబాడీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది బిడ్డకు మేలు చేస్తుంది. తల్లి పాలు శిశువు చెవులు, కళ్ళు, కడుపు, శ్వాస సంబంధిత అనేక సమస్యల నుండి కాపాడుతుంది. పిల్లలు ఆస్తమాకు గురయ్యే అవకాశం తక్కువ. తల్లిపాలు తాగే పిల్లలలో టైప్ 1 డయాబెటిస్, ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా తక్కువ. అంతేకాదు.. అనేక తీవ్రమైన రకాల క్యాన్సర్ల నుండి పిల్లలను రక్షిస్తుంది. తల్లి పాలలో అధిక స్థాయిలో ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇవి శిశువు యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి చాలా ఉపకరిస్తాయి.
వైరస్ సోకినా తల్లి నుండి పిల్లలకు వ్యాపించదు..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకారం.. కరోనా పాజిటివ్ తల్లి నవజాత శిశువుకు ఆహారం ఇవ్వాలనుకుంటే, ఆమె చేతులు బాగా కడుక్కోవాలి, నోటికి మాస్క్ పెట్టుకోవాలి. అయితే, ఇప్పటివరకు తల్లిపాల ద్వారా కరోనా వైరస్ సోకినట్లు ఎక్కడా ఆధారాలు బయటపడలేదు.
తల్లి పాలు ఎందుకు ముఖ్యమంటే..
పిల్లలలో మేధో సామర్థ్యాన్ని పెంచుతుంది.
శిశువుల మెదడు, శారీరక అభివృద్ధి జరుగుతుంది.
పిల్లలు అనేక వ్యాధులు, అంటురోగాల నుండి రక్షించబడతారు.
మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.
Also read:
Maha Samudram Review: ప్రేమ… స్నేహం… బంధం… బాధ్యతల కలయిక ‘మహా సముద్రం’