Milk Benefits: వయసు పైబడిన వారు పాలు తాగొచ్చా? 20 ఏళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనం ఏం చెబుతోంది?

పాలు తాగడం వల్ల గుండె జబ్బులు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు పాలకు దూరంగా ఉండటమే మంచిదని భావిస్తారు. అయితే తాజాగా జరిగిన ఒక సుదీర్ఘ అధ్యయనం ఈ విషయంలో సంచలన విషయాలను వెల్లడించింది. పాలు తాగడం వల్ల గుండెపోటు ముప్పు పెరగదు సరే కదా.. ఒక రకమైన స్ట్రోక్ ముప్పు సగానికి తగ్గుతుందని తేలింది.

Milk Benefits: వయసు పైబడిన వారు పాలు తాగొచ్చా? 20 ఏళ్ల పాటు జరిగిన ఈ అధ్యయనం ఏం చెబుతోంది?
Milk Consumption And Stroke Risk

Updated on: Dec 23, 2025 | 9:10 PM

కాల్షియం, ప్రోటీన్లకు నెలవైన పాలు గుండె ఆరోగ్యానికి శత్రువా? మిత్రువా? అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. గత రెండు దశాబ్దాలుగా పురుషుల ఆహారపు అలవాట్లపై జరిగిన పరిశోధనలో పాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

పాలు తాగడం వల్ల గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ముప్పు పెరుగుతుందనే వాదనలో వాస్తవం లేదని అమెరికా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. సుమారు రెండు దశాబ్దాల పాటు వయసు పైబడిన పురుషుల ఆహారపు అలవాట్లను నిశితంగా పరిశీలించిన తర్వాత పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు.

20 ఏళ్ల పాటు పరిశోధన దక్షిణ వేల్స్‌ ప్రాంతానికి చెందిన 45 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న పురుషులపై 1970 నుంచి ఈ పరిశోధన సాగింది. సుమారు 20 ఏళ్ల పాటు వారి ఆహారపు అలవాట్లు, అనారోగ్య సమస్యలు, మరణాలకు సంబంధించిన వివరాలను పరిశోధకులు సేకరించారు. పాలు ఎక్కువగా తాగే వారు, తక్కువగా తాగే వారిని రెండు గ్రూపులుగా విభజించి విశ్లేషణ చేశారు.

స్ట్రోక్ ముప్పు సగానికి తక్కువ ఎక్కువగా పాలు తాగే పురుషుల్లో ‘ఇస్కీమిక్ స్ట్రోక్’ (మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్ల వచ్చే పక్షవాతం) వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. పాలు తక్కువగా తాగే వారితో పోలిస్తే, ఎక్కువగా తాగే వారికి ఈ రకమైన స్ట్రోక్ వచ్చే ముప్పు దాదాపు 50 శాతం తక్కువగా ఉండటం గమనార్హం.

గుండె జబ్బులపై ప్రభావం ఇక గుండె జబ్బుల విషయానికి వస్తే.. పాలు తాగే వారికి, తాగని వారికి మధ్య పెద్దగా వ్యత్యాసం ఏమీ కనిపించలేదు. పాలు తాగడం వల్ల గుండె జబ్బులు పెరుగుతాయనే ఆరోపణలను ఈ గణాంకాలు తోసిపుచ్చాయి. అలాగే అన్ని రకాల మరణాల రేటును పరిశీలించినా.. రెండు వర్గాల మధ్య సమానమైన ఫలితాలే వచ్చాయి.

పాలు తాగడం వల్ల రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు పెరుగుతాయన్న వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు దొరకలేదని పరిశోధకులు స్పష్టం చేశారు. అయితే గుండె జబ్బులు ఉన్న వారు పాలను అధికంగా తాగాలని ఈ అధ్యయనం సిఫార్సు చేయలేదు. కేవలం పాలు ఆరోగ్యానికి ముప్పు కాదని మాత్రమే వివరించింది.

గమనిక: ఈ సమాచారం అంతర్జాతీయ పరిశోధనల ఆధారంగా ఇచ్చినది. ఏదైనా అనారోగ్యం ఉన్న వారు తమ ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.