పండ్లలో ఎన్నో పోషకగుణాలు ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే జబ్బులు కూడా దూరమవుతాయి. అయితే ఏ పండ్లు, ఏయే సమయాల్లో తినాలన్నదానిపై కాస్త అవగాహన ఉండాలి. అంతేకానీ ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఈవిషయంలో మనకంటే మన అమ్మానాన్నలకే బాగా అనుభవం. అప్పుడప్పుడు పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగొద్దని మనతో చెబుతుంటారు. వారు చెప్పేది అక్షరాలా నిజం. అన్నీ కాదు కానీ కొన్ని పండ్లు తిన్న తర్వాత నీళ్లు అసలు తాగకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పండ్లలో ఫ్రక్టోజ్ అంటే సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి పండ్లను తిన్న వెంటనే నీరు తాగితే చాలామందికి ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి. అలాగే అజీర్తి, ఎసిడిటీ ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే పండ్లు తినే 1 గంట ముందు లేదా 1 గంట తర్వాత నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అరటిపండు తిన్న తర్వాత నీరు త్రాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముఖ్యంగా అరటిపండ్లు తిన్న తర్వాత చల్లటి నీరు తాగితే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అరటిపండు, చల్లటి నీళ్లలోని గుణాలు అజీర్తిని కలిగిస్తాయి. అరటిపండు తిన్న తర్వాత కనీసం 15 నుండి 20 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
బేరిని తిన్న తర్వాత చాలామందికి దాహం వేస్తుంది. అయితే వెంటనే నీరు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి.
దోసకాయ, పుచ్చకాయ వంటి నీళ్లతో కూడిన పండ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. అయితే వీటిని తిన్న వెంటనే నీరు తాగితే ఉదర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఒక్కోసారి విరేచనాలు కూడా వస్తాయి.
సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో నీరు పుష్కలంగా ఉంటుంది. అయితే వీటిని తిన్న వెంటనే మళ్లీ నీరు తాగితే మన శరీరంలోని pH స్థాయులు దెబ్బతింటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి