చికెన్‌ స్కిన్‌లెస్‌ మంచిదా? స్కిన్‌తో మంచిదా? ఎవరు ఎలాంటి చికెన్ తినాలంటే..

|

Nov 09, 2022 | 12:05 PM

చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు.. మాంసహరులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు. మరీ ఎక్కువుగా చికెన్ తినేవారు అయితే వారంలో రెండు, మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా ఫ్రై ఇలా కోడి మాంసంతో తయారుచేసిన ఏదో ఒక డిష్..

చికెన్‌ స్కిన్‌లెస్‌ మంచిదా? స్కిన్‌తో మంచిదా? ఎవరు ఎలాంటి చికెన్ తినాలంటే..
Chicken
Follow us on

చికెన్ ను ఇష్టపడని వారెవరుంటారు.. మాంసహరులు ప్రతి వారంలో ఒక్కసారైనా తమ ఆహారంలో చికెన్ డిష్ జోడించుకోకుండా ఉండరు. మరీ ఎక్కువుగా చికెన్ తినేవారు అయితే వారంలో రెండు, మూడు సార్లు కూడా చికెన్ కర్రీ లేదా ఫ్రై ఇలా కోడి మాంసంతో తయారుచేసిన ఏదో ఒక డిష్ తింటారు. కొంతమందికైతే ముక్కలేనిదే ముద్ద దిగదని కూడా అంటారు. సాధారణంగా చికెన్ కొనడానికి దుకాణానికి వెళ్లగానే కొంతమంది స్కిన్ లెన్ చికెన్, మరికొంత మంది స్కిన్‌తో ఉన్న చికెన్ కొనుగోలు చేస్తారు. మనకి కావల్సినది ఏదో చెప్తే దానికి తగినట్లు డ్రెస్సింగ్ చేసి ఇస్తాడు. కొంతమంది స్కిన్‌తో ఉన్న చికెన్ నచ్చదు. స్కిన్ చికెన్, స్కిన్ లెస్ చికెన్ ధరల్లో కూడా స్వల్పమార్పులు ఉంటాయి. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 13.30 కోట్ల టన్నుల కోడి మాంసాన్ని వినియోగించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్) అంచనా వేసింది. భారత్ లో అయితే ఈ వినియోగం 41 లక్షల టన్నుల కన్నా ఎక్కువగానే ఉందని తెలిపింది. కొవ్వు తక్కువుగా ఉండటం, పోషకాహార పదార్థాలు ఎక్కువుగా ఉండటంతో పాటు శరీరానికి ప్రయోజనం కలిగించే మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కోడి మాంసంలో గణనీయంగా ఉంటాయి. ఈ కొవ్వులు గుండె సంబంధిత ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చికెన్ తినేటప్పుడు స్కిన్‌తో తినడం మంచిదా.. స్కిన్ లెస్ చికెన్ మంచిదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చికెన్ స్కిన్‌లో 32 శాతం కొవ్వు ఉంటుంది. అంటే ఒక కిలో చికెన్ స్కిన్‌ను తింటే అందులో 320 గ్రాముల కొవ్వు ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చికెన్ స్కిన్‌లో ఉండే కొవ్వుల్లో మూడింట రెండొంతులు అసంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటినే మంచి కొవ్వుగా పిలుస్తారు. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడటంలో ఈకొవ్వు సహాయపడుతుంది.

చికెన్‌ను స్కిన్‌తో తింటే సాధారణం కంటే దాదాపు 50 శాతం కెలరీలను పెంచుతుందంటున్నారు నిపుణులు. 170 గ్రాముల స్కిన్‌లెస్ చికెన్‌ను తింటే 284 కెలరీలు శరీరంలోకి చేరుతుంది. ఈ కేలరీల్లో 80 శాతం ప్రొటీన్ల నుంచి 20 శాతం కొవ్వు నుంచి అందుతాయి. 170 గ్రాముల చికెన్‌ను స్కిన్‌తో కలిపి తింటే శరీరంలోకి చేరే కేలరీల సంఖ్య 386‌కు చేరుతుంది. వీటిలో 50 శాతం కెలరీలు ప్రోటీన్ల నుంచి, 50 శాతం కొవ్వుల నుంచి అందుతుంది. ఎలాంటి రోగాలు లేకుండా, ఎత్తుకు తగినంత బరువు ఉండి, శారీరకంగా చురుగ్గా ఉండే వ్యక్తులు వండేటప్పుడు చికెన్ స్కిన్‌ను అలాగే ఉంచి తినేముందు స్కిన్‌ను తీసేస్తే మంచిందంటున్నారు నిపుణులు. వండేటప్పుడు చికెన్‌పై స్కిన్ ఉండటం వల్ల కూరకు తగిన రుచి కూడా వస్తుందంటున్నారు.

ఈ విషయంలో జాగ్రత్త..

చాలామంది చికెన్‌ను ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు. వండటానికి ముందు ఫ్రిజ్‌లో తీసి వంటగదిలో పెడతారు. కొంతమంది ఫ్రిజ్ లో తీసి బయట కొంతసేపు ఉంచిన తర్వాత మళ్లీ ఫ్రిజ్‌లో పెడతారు. అయితే ఇలా ఫ్రిజ్ నుంచి తీశాక గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన చికెన్‌ను మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టకూడదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఆహార పదార్థాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలను ఆపడం కోసం చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ ఉంచుతారు. దాన్ని బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన తరువాత సూక్ష్మజీవులు మళ్లీ పెరగడం మొదలవుతాయి. అందుకే ఒకసారి ఫ్రిజ్ నుంచి బయటకు తీసి సాధారణ ఉష్ణోగ్రతకు తెచ్చిన ఆహార పదార్థాలను మళ్ళీ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. అన్నిరకాల మాంసాలకు ఇది వర్తిస్తుందంటున్నారు పోషకాహర నిపుణులు. కావాలనుకుంటే మాంసాన్ని వండిన తర్వాత దాన్ని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. వండిన తర్వాత మాంసంలోని సూక్ష్మజీవులన్నీ నశిస్తాయి. అందువల్ల ఎటువంటి సమస్య ఉండదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..