Corona Dengue Fever: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. మరోవైపు డెంగ్యూ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే వాతావరణ మార్పుల కారణంగా సాధారణ జ్వరం, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. అయితే ఇక్కడ గమనిస్తే ఈ వ్యాధులన్నింటికీ దాదాపు ఒకే లక్షణాలు ఉంటాయి. దీనివల్ల వచ్చింది ఏ జ్వరమో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. అందుకే ఈ మూడు జ్వరాల మధ్య ఉన్న తేడాల గురించి తెలుసుకుందాం. అప్పుడే చికిత్స కూడా సులువు అవుతుంది.
కరోనా, డెంగ్యూ మధ్య తేడా
కరోనా, డెంగ్యూ మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా రెండు పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం. ఏది తేలితే దాని ప్రకారం చికిత్స అందిస్తారు.ఎవరైనా సరే జ్వరంతో ఆసుపత్రికి వెళితే కరోనా, డెంగ్యూ పరీక్షలు రెండూ ఉంటాయి. అయితే ఈ జ్వరాలు రాకుండా రక్షణ కూడా అవసరం. మీ ఇంటి చుట్టూ నిల్వ నీరు ఉండకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనాను నివారించడానికి మాస్క్ ధరించాలి. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
డెంగ్యూ జ్వరం ఉందో లేదో ఎప్పుడు తెలుసుకోవాలి?
డెంగ్యూ జ్వరం, సాధారణ జ్వరం మధ్య తేడాను గుర్తించడానికి ముఖ్యమైనది జలుబు. డెంగ్యూ కారణంగా జ్వరం వచ్చినప్పుడు జ్వరంతో పాటు శరీరంలో నొప్పులు కూడా ఉంటాయి. అదే సమయంలో సాధారణ వైరల్ జ్వరం వచ్చినప్పుడు జలుబు, మొదలైన వాటితో కూడి ఉంటుంది. ఈ సీజన్‌లో జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు వచ్చి జలుబు లేనట్లయితే వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించాలి. డెంగ్యూ దోమలు కుట్టిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత డెంగ్యూ జ్వరం లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి. డెంగ్యూ జ్వరంతో కళ్ళు ఎర్రగా మారుతాయి. రక్తం తగ్గుతుంది. తలతిరగడం వల్ల కొందరికి స్పృహ తప్పుతుంది.