Itchy Eyes: కళ్ళు దురద పెడుతున్నాయా? మీ కంటి చూపు డేంజర్లో పడ్డట్టే
కొన్ని సార్లు ఉన్నట్టుండి కళ్లు దురద పెడుతుంటాయి. కళ్లను నలపడం వల్ల ఎరుపెక్కి సమస్య మరింత ఎక్కువవుతుంది. వాతావరణ మార్పులు, అలర్జీలు, లేదా మరే ఇతర కారణాల వల్లనో కళ్ళు దురద పెట్టడం సహజం. అయితే, ఈ చిన్నపాటి అసౌకర్యం వెనుక కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కూడా దాగి ఉండవచ్చు. అసలు కళ్ళు ఎందుకు దురద పెడతాయి, దీనికి గల కారణాలు ఏమిటి, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కళ్లు దురద పెట్టడం అనేది చాలా సాధారణ సమస్య. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు స్వల్ప కారణాల వల్ల ఇలా జరగొచ్చు. మరికొన్నిసార్లు వైద్యపరమైన సమస్యలు దీనికి దారి తీయవచ్చు. దురద పెట్టే కళ్లను వైద్య పరిభాషలో ‘ఓక్యులర్ ప్రురిటస్’ అంటారు. ఇలాంటి సమయంలో కళ్లు నలపడం, గట్టిగా తుడవడం వంటివి చేస్తే కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. దీని వల్ల కళ్ల వెనక ఉండే సున్నిత భాగాలు దెబ్బతింటాయి. అది కంటి చూపును ప్రభావితం చేసే ప్రమాదం ఉంది.
కళ్ళు దురద పెట్టడానికి కొన్ని ప్రధాన కారణాలు ఇక్కడ చూద్దాం:
అలెర్జీలు:
కళ్ళు దురద పెట్టడానికి అలెర్జీలు ప్రధాన కారణం. పుప్పొడి, దుమ్ము, పెంపుడు జంతువుల బొచ్చు, లేదా కొన్ని రకాల రసాయనాలు వంటి అలెర్జీ కారకాలు కళ్ళను తాకినపుడు దురద, ఎరుపు, నీరు కారడం వంటివి జరుగుతాయి. దీన్ని ‘అలెర్జిక్ కంజక్టివైటిస్’ అంటారు. సీజనల్ అలెర్జీలు కూడా ఒక కారణం.
కాలుష్యం, దుమ్ము, ధూళి:
వాతావరణ కాలుష్యం, గాలిలో ఉన్న దుమ్ము, ధూళి రేణువులు కళ్ళలోకి చేరినపుడు చికాకు కలిగి దురద మొదలవుతుంది. ముఖ్యంగా వర్షాలకు తడిసినప్పుడు ఆ నీళ్లు కంట్లోకి వెళ్లి ఇలాంటి సమస్యను కలుగజేయవచ్చు.
పొడి కళ్ళు (డ్రై ఐ సిండ్రోమ్):
కళ్ళలో తగినంత కన్నీళ్లు ఉత్పత్తి కాకపోవడం లేదా కన్నీళ్ల నాణ్యత తగ్గడం వల్ల కళ్ళు పొడిబారుతాయి. దీనివల్ల కళ్ళలో మంట, దురద, ఇసుక పడ్డట్లు అనిపించడం, ఎరుపు రంగులోకి మారడం జరుగుతాయి. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు ఎక్కువసేపు వాడేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వేడి చేసే పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఇలా జరుగుతుంది.
కాంటాక్ట్ లెన్స్‌లు:
కాంటాక్ట్ లెన్స్‌లను సరిగా శుభ్రం చేయకపోవడం, వాటిని ఎక్కువ సమయం వాడటం, లేదా లెన్స్‌లు కళ్ళకు సరిపోకపోవడం వల్ల దురద రావచ్చు.
మేకప్ లేదా సౌందర్య సాధనాలు:
కళ్ళకు వాడే మేకప్, క్రీములు లేదా ఇతర సౌందర్య సాధనాల్లోని రసాయనాలు కొందరికి అలెర్జీని కలిగించి దురదకు దారి తీస్తాయి.
వైద్యపరమైన కారణాలు
కండ్లకలక (పింక్ ఐ):
ఇది కంటిలోపలి తెల్లటి పొర వాపుకు గురికావటం. ఇది బ్యాక్టీరియా, వైరస్ లేదా అలెర్జీల వల్ల వస్తుంది. దీనివల్ల కళ్ళు ఎర్రబడటం, దురద, నీరు కారడం లేదా జిగురు లాంటి స్రావాలు రావడం జరుగుతాయి.
బ్లెఫరైటిస్:
ఇది కనురెప్పల వాపు. కనురెప్పల అంచుల్లో నూనె గ్రంధులు అడ్డుపడటం వల్ల లేదా బ్యాక్టీరియా వల్ల ఈ సమస్య వస్తుంది. దీనివల్ల దురద, కనురెప్పలపై పొలుసులు, కంటి రెప్పలు ఒకదానికొకటి అంటుకుపోవడం జరుగుతుంది.
కార్నియల్ అల్సర్స్:
కంటి కార్నియాపై ఏర్పడే పుండ్లు దురద, నొప్పి, దృష్టి మసకబారడం వంటి లక్షణాలను కలిగిస్తాయి. ఇది తీవ్రమైన సమస్య.
ఇతర వ్యాధులు:
కొన్ని సందర్భాల్లో ఎగ్జిమా, థైరాయిడ్ సమస్యలు, డయాబెటిస్ లేదా ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా కళ్ళ దురదకు కారణం కావచ్చు. కళ్ళు తరచుగా దురద పెడుతుంటే, స్వల్పకాలిక ఇంటి చిట్కాలతో తగ్గకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది. సరైన కారణం తెలుసుకుని చికిత్స తీసుకోవడం కంటి ఆరోగ్యానికి అవసరం.




