Telugu News Health Is Your Daughter Entering Puberty Too Soon How to Prevent Early Puberty in Your Daughter
Early Puberty: పిల్లల్లో త్వరగా యవ్వనం రావడానికి అసలు కారణాలేంటి..?
చిన్న వయసులోనే అమ్మాయిల్లో యవ్వన లక్షణాలు కనిపించడం ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ గమనిస్తున్న సమస్య. దీనికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, అలాగే రసాయనాల ప్రభావం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ముందస్తు యవ్వనం వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
పిల్లలు చిన్న వయసులోనే యవ్వన దశకు చేరుకోవడం అనేది ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య అని డాక్టర్ కారుణ్య తెలిపారు. సాధారణంగా ఆడపిల్లల్లో 8 సంవత్సరాల తర్వాత శరీరంలో మార్పులు మొదలవుతాయి. అయితే కొందరు పిల్లల్లో ఈ మార్పులు అంతకంటే ముందే కనిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కేవలం ఆహారం మాత్రమే కాదని డాక్టర్ చెబుతున్నారు. ఈ సమస్యకు గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
పిల్లలు త్వరగా యవ్వన దశకు చేరుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని డాక్టర్ కారుణ్య అంటున్నారు. చాలా మంది అనుకునేలా కేవలం పాలు, చికెన్ వంటి ఆహార పదార్థాలు మాత్రమే దీనికి కారణం కావు. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి అవి ఏంటంటే..
వంశపారంపర్యం.. కుటుంబ చరిత్రలో ఎవరికైనా చిన్న వయసులోనే యవ్వన లక్షణాలు కనిపించి ఉంటే పిల్లలకు కూడా ఇలా జరిగే అవకాశం ఉంది.
హార్మోన్ల అసమతుల్యత.. శరీరంలో హార్మోన్లు సరిగా సమన్వయం కాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. హార్మోన్ల పనితీరులో వచ్చే మార్పుల వల్ల యవ్వనం త్వరగా ప్రారంభం కావచ్చు.
అధిక బరువు.. చిన్న వయసులోనే పిల్లలు అధిక బరువు పెరగడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి అది హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కూడా యవ్వన దశ త్వరగా మొదలవుతుంది.
ఆహారపు అలవాట్లు.. ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం తినడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తవచ్చు. ఈ రకమైన ఆహారం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.
రసాయనాల ప్రభావం.. కొన్ని రకాల కాస్మెటిక్స్, సబ్బులు, డిటర్జెంట్లలో ఉండే పారాబెన్స్, ట్రైక్లోసాన్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి. వీటిని ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని పిలుస్తారు. ఇవి శరీరంలోకి చేరి సహజ హార్మోన్ల పనితీరును అడ్డుకోవడం వల్ల యవ్వనం త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
ఆరోగ్యకరమైన ఆహారం.. పిల్లలకు వీలైనంత వరకు ఇంట్లో వండిన తాజా, పోషకాలతో కూడిన ఆహారం ఇవ్వాలి. బయట దొరికే జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారం హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.
సురక్షితమైన ఉత్పత్తుల ఎంపిక.. పిల్లల కోసం వాడే స్కిన్‌కేర్, హెయిర్‌కేర్ ఉత్పత్తులను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పారాబెన్స్, ఫ్తాలేట్స్ వంటి రసాయనాలు లేని సురక్షితమైన ఉత్పత్తులను మాత్రమే వాడాలి.
ఇంటి పరిశుభ్రత.. ఇంటి శుభ్రత కోసం సాధ్యమైనంత వరకు సహజమైన పదార్థాలతో తయారు చేసిన డిటర్జెంట్లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్‌ని ఉపయోగించాలి. రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులు హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపవచ్చు.
ఈ విషయాలను గమనించి చిన్నపాటి మార్పులు చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా చూడవచ్చని డాక్టర్ కారుణ్య తెలిపారు. చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద ఆరోగ్య సమస్యలను కూడా నివారించవచ్చు. మీ పిల్లల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారు వాడే ఉత్పత్తుల విషయంలో శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.