AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Onion, Garlic: మొలకెత్తిన ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం మంచిదేనా..? ఎందుకు మొలకలు వస్తాయి..?

Onion, Garlic: ఉల్లి, వెల్లుల్లి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వంటింట్లో ఉన్న వీటితో ఉపయోగాలు అన్ని ఇన్ని కావు. పలు అనారోగ్య సమస్యలను దూరం చేసే గుణాలు ఉల్లి, వెల్లుల్లిలో..

Onion, Garlic: మొలకెత్తిన ఉల్లిపాయ, వెల్లుల్లి తినడం మంచిదేనా..? ఎందుకు మొలకలు వస్తాయి..?
Follow us
Subhash Goud

|

Updated on: Aug 21, 2021 | 12:07 PM

Onion, Garlic: ఉల్లి, వెల్లుల్లి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వంటింట్లో ఉన్న వీటితో ఉపయోగాలు అన్ని ఇన్ని కావు. పలు అనారోగ్య సమస్యలను దూరం చేసే గుణాలు ఉల్లి, వెల్లుల్లిలో ఉన్నాయి. ఏ వంటకం చేయాలన్న ముందుగా నూనెలో ఉల్లిపాయలు వాడాల్సిందే. ఇవి కూరల్లో ఎంతో రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిదే. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వీటిలో విటమిన్‌ -సి, విటమిన్‌ బి6, పోటాషియం, ఫోలేట్‌ వంటివి పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లిలో వీటితో పాటు క్యాల్షియం, ఫాస్పరస్‌, కాపర్‌, మెగ్నీషియం వంటివి అధిక మోతాదులో ఉంటాయి. ఇక వీటికి కూడా మొలకలు వస్తుంటాయి. అయితే మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లిని కోసేస్తుంటారు. మరికొందరికి వాటిని ఉపయోగించాలా? వద్దా? అనే అనుమానాలు వస్తుంటాయి. మరి, మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లి ఉపయోగించడం మంచిదేనా? తెలుసుకుందాం.

మామూలుగా మనం నేలలో నాటందే చాలా వరకూ మొక్కలు మొలకెత్తవు. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ ఉల్లి, వెల్లుల్లి మాత్రం ఎక్కడున్నా మొలకలు వస్తుంటాయి. నేలలో లేపోయినా వాటిని అలాగే ఉంచేస్తే ఆ మొలకలు పొడవుగా పెరుగుతాయి. దీనికి కారణం మన కిచెన్‌లో ఉండే తేమ వాతావరణమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఉల్లి, వెల్లుల్లి మొలకెత్తేందుకు కాస్త తేమ వాతావరణం ఉంటే సరిపోతుందని అంటున్నారు. తమలో ఉన్న శక్తిని, పోషకాలను ఉపయోగించి తామే పెరుగుతాయి. ప్రత్యేకంగా నేలలో నాటకపోయినా.. ఇలా మొలకెత్తడం అనేది వాటిలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇలా మొలకెత్తడం వల్ల వాటిలో ఎలాంటి టాక్సిన్లు విడుదల కావు. కానీ అవి కాస్త జిగురుగా పాడయిపోయినట్లుగా మారిపోవచ్చు.

ఇలాంటప్పుడు కాస్త పాడైన భాగాన్ని తొలగించి మంచిగా ఉన్న భాగాన్ని ఉపయోగించుకుంటాము. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. మొలకలు అప్పుడప్పుడే వస్తున్నాయి అనిపించినప్పుడే అలాంటివాటిని పక్కకి ఉంచి ముందు వాటిని వాడేయడం వల్ల అవి పాడవక ముందే వాడే వీలుంటుంది. మొలకలు పెద్దగా అవుతున్న కొద్దీ ఉల్లి లేదా వెల్లుల్లిపాయలు కుళ్లడం మనం చూస్తూనే ఉంటాము. ఇలా కుళ్లిపోయిన వాటిని పడేయడం తప్ప ఇంకేమీ చేయలేం. చాలామందికి ఈ మొలకల రుచి చాలా ఇష్టం. అందుకే మొలకలు వచ్చే వరకూ ఆగి ఆ తర్వాత తింటుంటారు కొందరు.

మొలకలతో ఎన్నో ప్రయోజనాలు..

మొలకలు వచ్చిన ఉల్లి, వెల్లుల్లితో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మొలకల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోవడం కూడా మంచిదేనంటున్నారు. ఈ మొలకలు నేరుగా తింటే కాస్త చేదుగా అనిపించవచ్చు. అందుకే ఉల్లి, వెల్లుల్లి ముక్కలతో పాటు కూరల్లో వేసుకొని తినడం మంచిది.

పొడి ప్రదేశంలో..

మామూలుగా వంటింట్లో ఉండే తేమ కారణంగా మొలకలు వస్తుంటాయి. ఇలా కాకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచినట్లయితే మొలకలు రాకుండా ఉంటాయి. వాటికి గాలి తగిలేలా కూడా చూసుకోవాలి. అవి పండుతున్నప్పుడు విడుదలయ్యే ఇథలిన్ వల్ల కూడా ఉల్లిపాయలు మొలకెత్తుతాయి. వీలైతే మంచాల కింద లేదా అటక మీద వీటిని భద్రపర్చుకోవడం వల్ల మొలకలు రాకుండా ఉంటాయి.

ఇవీ కూడా చదవండి: Fruits Eat: భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం సరైనదేనా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Milk Teeth: పిల్లలు తమ పాల దంతాలను ఎందుకు కోల్పోతారు.. దీని వెనుక అసలైన కారణం ఇదే..!