ICMR Report: భారతదేశంలో ఎక్కువగా మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆహార నియమాలు, జీవన శైలి, కుటుంబ చరిత్ర కారణంగా డయాబెటిస్ (Diabetes) బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. అయితే ఈ డయాబెటిస్‌కు ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పు చేసుకోవడం ద్వారా అదుపులో పెట్టుకోవాలి తప్ప.. పూర్తిగా నియంత్రించలేము. ఇక 60 శాతం మంది భారతీయులకు మధుమేహం నియంత్రణలో ఉండటం లేదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటిస్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే అదుపులో ఉంచుకోగలుగుతున్నారని, పైగా, మధుమేహంతో కూడిన రక్తపోటు ఉన్నవారిలో 50 శాతం మందికి వారి రక్తపోటు నియంత్రణలో ఉండదని ఐసీఎంఆర్ (ICMR) నిర్వహించిన అధ్యయనంలో స్పష్టమైంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ ఉన్న 10 మందిలో దాదాపు 6 గురు తమ కొలెస్ట్రాల్‌ను నియంత్రించలేకపోతున్నారని పరిశోధకులు అధ్యయనాల ద్వారా గుర్తించారు. ప్రస్తుతం భారతీయులు మధుమేహం, రక్తపోటు, కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారిలో కేవలం 8 శాతం మంది మాత్రమే అదుపులో పెట్టుకోగలుగుతున్నారని పరిశోధకులు తెలిపారు.
ఈ మూడు వ్యాధులతో బాధపడుతున్న 90 శాతం మంది భారతీయులు కనీసం ఒకదానిని కూడా నియంత్రణలో పెట్టుకోలేకపోతున్నారు. ఈ అధ్యయనాన్ని 2008 నుంచి నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నివేదిక ఏప్రిల్ 2022లో లాన్సెట్ జర్నల్‌లో ప్రచురించబడింది. కాగా, మధుమేహం, గుండె సమస్యలు, కొలెస్ట్రాల్‌తో పాటు ఇతర సమస్యలను ఎదుర్కొంటున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వివిధ రకాల వైరస్‌లు వెంటాడుతున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాల మీదకే వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి