Heart Disease: ప్రస్తుతం గుండె జబ్బులతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. గుండె జబ్బులతో పాటు మధుమేహం, ఇతర వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే మన నిద్ర గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, గుండెపోటును పెంపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల పరిశోధకులు నిర్వహించిన పరిశోధనలలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పరిశోధన నివేదిక యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైంది.
ఇటీవల ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు నిద్రకు, గుండె ఆరోగ్యానికి సంబంధించి పరిశోధన నిర్వహించారు. అర్ధరాత్రి లేదా ఆలస్యంగా నిద్రిస్తే గుండె ఆరోగ్యం దెబ్బ తింటుందని పరిశోధకులు స్పష్టం చేశారు. త్వరగా నిద్రపోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తేల్చి చెప్పారు. శరీరంలో జీవ గడియారం మనల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీనిని సిర్కాడియన్ రిథమ్ అంటారు. రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం కారణంగా సిర్కాడియన్ రిథమ్ దిగజారుతుందని, దీనిని మెరుగు పర్చాలంటే రాత్రి 10-11 మధ్య నిద్రపోవడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆలస్యంగా నిద్రపోయే మహిళలు ఈ సమయాలను పాటించడం ఎంతో ముఖ్యమని పరిశోధకులు సూచిస్తున్నారు.
జీవ గడియారం వేళలు మారొద్దు..
ఇక ఆలస్యంగా నిద్రించే వారు ఉదయం ఆలస్యంగా మేల్కొంటారు. దీంతో జీవ గడియారం సమయ వేళలు మారుతాయి. ఇలా జరగడం వల్ల గుంఎడపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, దీంతో గుండెకు సంబంధించిన వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో త్వరగా నిద్రించడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు. 43 నుంచి 74 ఏళ్ల మధ్య ఉన్న 88 వేల మంది బ్రిటీస్ పెద్దలపై ఈ పరిశోధన నిర్వహించారు. ప్రతి రోజు వీరి నిద్ర సమయ వేళలను పరిశీలించారు. వారి జీవనశైలికి సంబంధించిన అంశాలతో బేరీజు వేసుకున్నారు. ఆలస్యంగా నిద్రపోయే వారిలో గుండె జబ్బులు, గుండె పోటు, గుండెకు సంబంధించి ఇతర సమస్యలు తలెత్తుతాయని పరిశోధనల ద్వారా గుర్తించారు.రాత్రి 10-11 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండె జబ్బులు తక్కువగా ఉన్నాయని గుర్తించగా, ఇదే సమయంలో అర్ధరాత్రి తర్వాత నిద్రపోయే వ్యక్తుల్లో ఈ ప్రమాదం 25 శాతం వరకు ఎక్కువగా ఉంటుందని తేల్చారు. అందుకే ప్రతి ఒక్కరు త్వరగా నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని గుర్తించారు.
ఇవి కూడా చదవండి: