కొవ్వు ఆరోగ్యానికి మంచిది కాదని అనేక మంది భావిస్తారు. కానీ మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు కూడా చాలా అవసరం. నిజానికి, కొవ్వు అనేది ఆహారాలలో కనిపించే ఒక రకమైన సూక్ష్మపోషకం. ఈ కొవ్వులు శరీరానికి శక్తిని అందించడంలో, ఆరోగ్యకరమైన చర్మం, జుట్టును నిర్మించడంలో సహాయపడతాయి. ఈ కొవ్వులు మెదడు పనితీరు, వాపు నియంత్రణ, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. అయితే ఎలాంటి కొవ్వు పదార్థాలు తింటున్నారనే విషయం కూడా చాలా ముఖ్యం. సంతృప్త, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఆహారాలకు ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. వీటికి బదులుగా, బహుళ అసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా పుష్కలంగా అందుతాయి. కణాల పెరుగుదలకు, మెదడు ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కొవ్వులు అవసరం. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు ఏయే ఆహారాల్లో ఉంటాయంటే..
సాధారణంలో నూనెల్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది. కాబట్టి వేయించిన ఆహారాన్ని నివారించడం మంచిది. కానీ నూనె లేకుండా వంట చేయడం సాధ్యం కాదు. అందుకు రైస్ బ్రాన్ ఆయిల్ ఎంచుకోవచ్చు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి.
నెయ్యి ఆరోగ్యానికి హానికరం కాదు. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. నెయ్యి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నాయని, ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఆలివ్ నూనెతో చేసిన ఆహారాన్ని తినడం వల్ల పలు రకాల వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
వాల్ నట్స్, బాదం వంటి నట్స్ లో విటమిన్ ఇ, అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. 2018 అధ్యయనం ప్రకారం.. గింజలు తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. బాదంపప్పులు వంటి నట్స్‌ను స్నాక్స్‌గా తినవచ్చు.
గుమ్మడికాయ గింజలు, చియా గింజలు, అవిసె గింజలు వంటి విత్తనాలలో బహుళఅసంతృప్త కొవ్వులు ఉంటాయి. ఈ ఆహారాలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా ఈ విత్తనాలలో విటమిన్ ఇ, ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి.
పాలతో తయారు చేసిన వెన్నలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. కానీ నట్ బటర్‌లలో మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
మరిన్ని తాజా ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.