తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం.. రోజూ పరగడుపున తీసుకోవడం మర్చిపోకండి..!

పసుపు నెయ్యి కలిపి తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..? పసుపును ఈ ఒక్క వస్తువుతో ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. మనం ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే కొన్ని ఆహారాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా ప్రతి ఉదయం నెయ్యి పసుపుతో కలిపి తినడం వల్ల వచ్చే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యం.. రోజూ పరగడుపున తీసుకోవడం మర్చిపోకండి..!
Turmeric With Ghee Benefits

Updated on: May 13, 2025 | 4:04 PM

పసుపు రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే నెయ్యి వంటలకు రుచిని ఇస్తుంది. ఈ రెండింటినీ కలిపి ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు. ఉదయం ఒక చెంచా నెయ్యి, కొంత సేంద్రీయ పసుపుతో రోజును ప్రారంభించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. నెయ్యి జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది. కడుపులోని లోపలి పొరను రక్షిస్తుంది. ఇది పిత్తరసం ఉత్పత్తిని పెంచుతుంది. పసుపు ఆహారాన్ని సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.

చాలా మందికి కీళ్ల నొప్పులు సాధారణ సమస్యగా మారాయి. దీనికి సహజమైన పరిష్కారంగా నెయ్యి, పసుపు మిశ్రమం ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమం కీళ్ల మధ్య ఏర్పడే ఘర్షణను తగ్గించి నొప్పిని తక్కువ చేస్తుంది. నెయ్యి సహజ నూనెలా పనిచేసి కీళ్ల కదలికను సులభతరం చేస్తుంది. అంతేకాకుండా నెయ్యి ద్వారా విటమిన్ డీ శరీరంలో బాగా శోషించబడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుణం కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీని వల్ల శరీరంలోని వాపు తగ్గి కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

శరీర శ్రమ తక్కువగా ఉండటం, పోషకాహార లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారుతాయి. దీనివల్ల అంతర్గతంగా మంటలు పెరుగుతాయి. ఈ సమయంలో ఖాళీ కడుపుతో నెయ్యి పసుపు మిశ్రమం తినడం వల్ల మంటలు తగ్గుతాయి. ఇందులో బ్యూటిరేట్ అనే ఫ్యాటీ యాసిడ్ మంటను నియంత్రిస్తుంది. పసుపులోని కర్కుమిన్ శరీర అవయవాలలో ఏర్పడే ఇన్ఫ్లమేటరీ కణాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.

పసుపు, నెయ్యితో కలిపి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది శ్లేష్మ పొరలను రక్షిస్తుంది. పసుపు యాంటీవైరల్, యాంటీబాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో రోగాల నుండి రక్షణ కలిగిస్తుంది.

నెయ్యి, పసుపు కలయిక నాడీ వ్యవస్థపై ప్రశాంతంగా పనిచేస్తుంది. నెయ్యిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం సెరోటోనిన్‌గా మారి నిద్ర నియంత్రణలో సహాయపడుతుంది. అలాగే, పసుపులో ఉండే కర్కుమిన్ మెదడులో ఏర్పడే వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ రెండింటి కలయిక శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి నాణ్యమైన నిద్రకు తోడ్పడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)