AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Vs Heart Attack: ఛాతీలో నొప్పి దేనికి సంకేతం..? గుండె నొప్పా..? గ్యాస్ నొప్పా..? ఎలా తెలుసుకోవాలి..?

ఛాతీలో ఒక్కసారిగా నొప్పి వచ్చినప్పుడు చాలా మందికి మొదట చాలా భయం కలుగుతుంది. గుండెపోటేనా..? అనే అనుమానం వస్తుంది. కానీ అన్ని ఛాతీ నొప్పులు గుండె సంబంధితమైనవి కావు. కొన్నిసార్లు గ్యాస్ సమస్యల వల్ల కూడా ఛాతీలో అసౌకర్యం కలగవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రాణాలకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సిన సందర్భాల్లో ఆలస్యం చేయకూడదు.

Gas Vs Heart Attack: ఛాతీలో నొప్పి దేనికి సంకేతం..? గుండె నొప్పా..? గ్యాస్ నొప్పా..? ఎలా తెలుసుకోవాలి..?
Heart Healthy
Prashanthi V
|

Updated on: Jun 13, 2025 | 2:47 PM

Share

ఛాతీలో ఒక్కసారిగా నొప్పి వచ్చినప్పుడు చాలా మందికి మొదట చాలా భయం కలుగుతుంది. గుండెపోటేనా..? అనే అనుమానం వస్తుంది. కానీ అన్ని ఛాతీ నొప్పులు గుండె సంబంధితమైనవి కావు. కొన్నిసార్లు గ్యాస్ సమస్యల వల్ల కూడా ఛాతీలో అసౌకర్యం కలగవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించడం చాలా అవసరం. ఎందుకంటే ప్రాణాలకు సంబంధించిన చికిత్స తీసుకోవాల్సిన సందర్భాల్లో ఆలస్యం చేయకూడదు.

గ్యాస్ వల్ల కలిగే ఛాతీ నొప్పి ఎలా ఉంటుంది..?

గ్యాస్ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సార్లు ఛాతీ పక్కన అసౌకర్యంగా ఉంటుంది. ఇది గుండె నొప్పిగా అనిపించవచ్చు. గ్యాస్ వల్ల వచ్చే ఛాతీ నొప్పి సాధారణంగా ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • పొట్ట ఉబ్బటం, కడుపు పగిలేలా ఒత్తిడి
  • పొట్టలో గాలి కదులుతున్నట్టు అనిపించడం
  • ఛాతీలో పొడిచినట్టు, కొట్టినట్టు చిన్న నొప్పి
  • వాంతులు అవుతున్నట్టు అనిపించడం లేదా అసహనంగా ఉండటం
  • త్రేన్పులు, ఊపిరి తేలికగా రాకపోవడం

ఇలాంటి నొప్పి ఎక్కువగా కొంతసేపు మాత్రమే ఉంటుంది. సాధారణంగా గ్యాస్ బయటకు వెళ్ళిన తర్వాత ఉపశమనం కలుగుతుంది.

గుండెపోటు వల్ల వచ్చే నొప్పి లక్షణాలు ఎలా ఉంటాయి..?

గుండెపోటు చాలా తీవ్రమైన విషయం. ఇది ప్రాణాలకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. గుండెపోటు కారణంగా వచ్చే ఛాతీ నొప్పి లక్షణాలు సాధారణంగా ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • ఛాతీ మధ్యలో గట్టిగా నొప్పి రావడం
  • నొప్పి భుజం, చేతులు, మెడ, దవడ లేదా వెన్ను వరకు పాకడం
  • ఒత్తిడి, ఛాతీ నలిపేలా ఉండే నొప్పి
  • ఊపిరి తీసుకోవడానికి కష్టం అనిపించడం
  • విపరీతమైన చెమటలు పట్టడం, వాంతులు లేదా తలనొప్పి
  • మైకం, నీరసం, చూపు మబ్బుగా మారడం

ఈ లక్షణాలు కొంతమందిలో అన్నీ కనిపించవచ్చు, మరికొంతమందిలో కొన్ని మాత్రమే ఉండవచ్చు. అయితే ఒకవేళ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సేవలు పొందాలి. ప్రథమ చికిత్సలో సకాలంలో చర్యలు తీసుకుంటే ప్రాణాలు రక్షించవచ్చు.

ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి..?

ఒక్కసారిగా ఛాతీలో అసాధారణ నొప్పి వస్తే ఇది సాధారణమైన గ్యాస్ సమస్యగా తీసుకోకుండా.. ముందు దీని తీవ్రతను అంచనా వేయాలి. నొప్పి స్థిరంగా ఉందా..? పాకుతోందా..? వాంతులు, చెమటలు, ఊపిరి తక్కువగా అనిపిస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం అవును అయితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళడం మంచిది.

గ్యాస్ సమస్యా..? లేక గుండె ప్రమాదమా..?

చాలా సార్లు గ్యాస్ సమస్యలు కూడా భయంకరంగా అనిపించవచ్చు. కానీ తేడా తెలుసుకోగలిగితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే నొప్పి దూరం వరకు పాకుతుందో, ఎక్కువ సమయం కొనసాగుతుందో, శరీరం నీరసంగా మారుతుందో.. అప్పుడు ఇది గుండెపోటు అయ్యే అవకాశాన్ని సూచిస్తుంది. అలాంటి సందర్భాల్లో సొంతంగా మందులు వేసుకోవడం కన్నా డాక్టర్‌ ను సంప్రదించడం మంచిది.

ఈ సమాచారం పెద్దలకు చాలా అవసరం. ఎందుకంటే చాలా మంది గ్యాస్ వల్ల వచ్చిన తాత్కాలిక నొప్పిని గుండెపోటుగా భావించి ఆందోళన పడుతారు. అదే సమయంలో నిజమైన గుండె సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదంలో పడుతారు. అందుకే సరైన జ్ఞానం అవగాహనతో స్పందించడం ముఖ్యం.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)