పొద్దున్నే నిద్ర లేవగానే మీకు ఇలా అవుతుందా..? అయితే జాగ్రత్త.. ఆరోగ్యానికి ముప్పు..!
మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర అత్యవసరం. కేవలం సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం మాత్రమే కాదు.. శరీరానికి సరిపోయే నిద్ర కూడా ఉండాలి. ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం మానేశారు. ఫలితంగా వారి ఆరోగ్యంపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు తగినంత నిద్ర తీసుకోవడం లేదని సూచించే కొన్ని సంకేతాలు ఇక్కడ ఉన్నాయి.

రాత్రి తగిన సమయానికి పడుకున్నా.. ఉదయం లేచిన తర్వాత లేదా మధ్యాహ్నం సమయంలో నిద్రపోవాలనిపిస్తే అది మీ నిద్ర నాణ్యత తక్కువగా ఉందని స్పష్టం చేస్తుంది. శరీరానికి కావాల్సిన విశ్రాంతి దొరకడం లేదని దీన్ని బట్టి చెప్పవచ్చు. మెదడు బాగా పనిచేయాలంటే నిద్ర ఎంతో అవసరం. నిద్ర సరిగా లేకపోతే మనలో ఏకాగ్రత తగ్గిపోతుంది. చిన్న విషయాల్లో కూడా మనసు నిలపలేకపోతాం. ఫలితంగా నిర్ణయాలు తీసుకోవడంలో, సమస్యలు పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
నిద్ర తగ్గితే శరీరంలో హార్మోన్లు అసమతుల్యంగా తయారవుతాయి. ఇవి ఆకలిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నిద్రలేమి వల్ల అవసరం లేని సమయంలో కూడా ఆకలి వేయడం, ఎక్కువగా తినాలనిపించడం లాంటి ప్రభావాలు కనిపిస్తాయి.
సాధారణ పరిస్థితుల్లో చిన్న విషయాలను పట్టించుకోనివారు కూడా నిద్రలేమితో అసహనంగా మారిపోతారు. చిరాకు ఎక్కువగా రావడం, చిన్న విషయానికే బాధపడటం లాంటి మానసిక పరిస్థితులు నిద్రలేమితో సహజం. ఇది మన భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
నిద్ర తక్కువగా ఉన్నప్పుడు శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు త్వరగా వస్తాయి. అలాగే ఉన్న జబ్బు నుంచి కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఉదయాన్నే లేచినప్పుడు తలనొప్పితో బాధపడితే.. అది నిద్రలో లోపం ఉందనే సంకేతం. ముఖ్యంగా సరిగా నిద్రపోకపోతే లేదా నిద్ర మధ్యలో ఎక్కువసార్లు మెలకువ రావడం వల్ల తలనొప్పులు తలెత్తుతాయి.
ఈ ఆరు లక్షణాల్లో ఒకటి మీకు తరచుగా కనిపిస్తే.. అది మీరు తగినంతగా నిద్రపోవడం లేదనే సంకేతం. నిద్ర తగ్గడం వల్ల మెటబాలిజం, రక్తపోటు, హార్మోన్ల స్థితి లాంటి అంశాలు సమతుల్యత కోల్పోతాయి. దీర్ఘకాలికంగా చూస్తే ఇది డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోయే అలవాటు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.




