ప్రతి ఇంటి వంటగదిలో వెల్లుల్లి తప్పక ఉంటుంది. వెల్లుల్లికి చాలా సుగుణాలు ఉన్నాయి. అయితే చాలా మంది శాకాహారులు వెల్లుల్లికి దూరంగా ఉంటారు. నిజానికి.. వంటల్లో వెల్లుల్లి వేస్తే మంచి సువాసన వస్తుంది. అది మంచి అనుభూతిని కలిగిస్తుంది కూడా. వెల్లుల్లి కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. కోవిడ్ అనంతరకాలంలో ప్రతిఒక్కరూ మరింత ఆరోగ్య స్పృహతో ఉంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారంతో రోజును ప్రారంభిస్తున్నారు. ఉదయాన్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో కొందరు వేడినీళ్లలో తేనె కలిపి తాగుతుంటే.. మరికొందరేమో వెల్లుల్లి రెబ్బను వేడినీళ్లతో తింటున్నారు. ప్రతి ఉదయాన్ని వెల్లుల్లితో ప్రారంభించడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
వెల్లుల్లిలో కేలరీలు చాలా తక్కువ. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి6, మాంగనీస్, సెలీనియం వంటి మినరల్స్ ఉంటాయి. అందుకే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వెల్లుల్లిలో అల్లిసిన్‌తో సహా బహుళ యాంటీమైక్రోబయాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రోజూ వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి తినడం వల్ల జలుబు తగ్గుతుంది. ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాకుండా వెల్లుల్లి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో మంచి, చెడు అనే రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయనే సంగతి తెలిసిందే. వెల్లుల్లి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. రక్త ప్రసరణను నిర్వహించడం ద్వారా గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వెల్లుల్లిని తప్పక తినాలి.
వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. హానికరమైన కణాలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వెల్లుల్లి మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి క్యాన్సర్‌తో సహా కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ ఇన్ఫ్లమేటరీ సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది. అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అల్పాహారంలో కూడా వెల్లుల్లి తినవచ్చు. అయితే వెల్లుల్లి ఎక్కువగా ఉంటే కొంత మంది ఆహారాన్ని జీర్ణించుకోలేరు. వెల్లుల్లి ఎక్కువైతే మన శరీరంలో రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి వెల్లుల్లిని తీసుకునే ముందు పోషకాహార నిపుణుల సలహా తీసుకోవడం మర్చిపోకూడదు.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.