సాధారణంగా ఆఫీస్ పని గంటలు 8 నుంచి 10 గంటల వరకు ఉంటాయి. ఒక్కో సంస్థలో ఒక్కో రకమైన పని వేళలు ఉంటాయి. వీరిపై పనిభారం కూడా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రాత్రి పూట కూడా పనులు చేస్తుంటారు. రోజంతా ల్యాప్ టాప్, కంప్యూటర్ ముందు గంటల తరబడి పనిచేయడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కూర్చుని చేసే పనులు తాత్కాలికంగా హాయిగానే ఉన్నా.. భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు వస్తాయి. కూర్చొని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు విపరీతంగా పెరిగిపోతుంది. అదనపు కొవ్వుల కారణంగా ఎన్నో వ్యాధులు సోకే అవకాశం ఉంది. పని మధ్యలో లేవకుండా అలాగే 8 గంటలు కూర్చుని పనిచేస్తే గుండె జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చిస్తున్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన సర్వే ప్రకారం ఒక వ్యక్తి ఎనిమిది గంటలు లేదా అంతకంటే ఎక్కువ గంటలు కూర్చుని పనిచేయడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం 50 శాతం ఉంటుందని తేలింది.
ఈ సర్వేలో 21 దేశాలకు చెందిన 1,05,677 మంది రికార్డులను పరిశీలించారు. ఈ సర్వే లెక్కల ప్రకారం.. వీరిలో గుండెపోటు కేసులు 2,300 ఉండగా, 3000 కేసులు స్ట్రోక్, 700 గుండె వైఫల్యం కేసులు ఉన్నాయి. కాగా.. వీళ్లందరూ గంటల తరబడి కూర్చుని పని చేసే వారు కావడం గమనార్హం. వ్యాయామం ఎక్కువ సేపు చేసే వారు హార్ట్ ప్రాబ్లమ్స్ తో చనిపోయే అవకాశం 17 శాతం ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇక మరీ తక్కువగా వ్యాయామం చేసేవారు గుండె జబ్బులతో చనిపోయే అవకాశం 50 శాతం ఉంటుందని తేలింది. శారీరక వ్యాయామం లేకపోవడం, గంటలకు గంటలు కూర్చోవడం వల్ల 5.8 శాతం గుండె జబ్బులొస్తే.. 8.8 శాతం మరణాలు సంభవిస్తున్నాయట.
అందుకే ఎక్కువ సేపు కూర్చోకుండా పని మధ్య మధ్యలో లేచి కాసేపు నడవాలి. ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా అర్థ గంటలకు లేదా గంట గంటకు లేచి నడవాలి. మొత్తంగా 8 గంటలు కూర్చొని పనిచేస్తే గుండె జబ్బులొస్తాయన్న సంగతిని మర్చిపోకూడదు.
నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు పాఠకుల అభిప్రాయం కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిది.