భారతీయ సంప్రదాయంలో కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఏ పని చేసినా కుటుంబ శ్రేయస్సు కోసం చేస్తుంటారు. అందరి నిర్ణయాలకు గౌరవిస్తుంటారు. ఇక ఆహారపు అలవాట్లలో ఒక్కొక్కరికి ఒక రకమైన ఆసక్తి ఉంటుంది. అంతే కాకుండా హెల్తీ ఆహారపు అలవాట్లలోనూ భారతీయులు ముందు వరసలో ఉంటారు. అయితే వేగంగా మారుతున్న పరిస్థితులు.. లైఫ్ స్టైల్ లో వస్తున్న మార్పుల కారణంగా భోజనం చేసే వేళల్లో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. గతంలో కుటుంబసభ్యులతో కలిసి ఆహారాన్ని తీసుకునేవారు. కానీ ప్రస్తుతం మారిపోతున్న పని వేళలు కారణంగా ఈ విధానానికి స్వస్తి పలికేశారు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పులు తింటున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే.. ఏ పండగకో, పర్వదినానికో, ఉత్సవానికో అందరూ కలిసి ఆహారం తినడం కాస్త ఊరట కలిగించే విషయం. అయితే కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ బెనెఫిట్స్ ను గుర్తించిన అమెరికా.. డిన్నర్ థెరపీ అభ్యాసానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ డిన్నర్ థెరపీ కారణంగా కుటుంబసభ్యులు సంతోషంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఈ విధానం అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఫాలో అవుతున్నాయి.
కలిసి ఫ్యామిలీ టెన్షన్ తగ్గించడానికి ఇదో సీక్రెట్ ఫార్ములా అని కూడా చెప్పుకుంటున్నారు. దాదాపు 91 శాతం మంది తల్లిదండ్రులు కుటుంబంతో కలిసి భోజనం చేయడం వలన ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతున్నట్లు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. హెల్తీ ఫర్ గుడ్ మూవ్‌మెంట్ ద్వారా అమెరికాలోని వెయ్యి మంది పెద్ద వారిపై వేక్‌ఫీల్డ్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడయ్యాయి. సగటున పెద్దలు దాదాపు సగం మంది ఒంటరిగా తింటారని తేల్చారు. 84 శాతం మంది ప్రజలు తమ ప్రియమైన వారితో తినాలని కోరుకుంటున్నట్లు గుర్తించారు. కుటుంబంతో డిన్నర్ మిస్ అవడం వల్ల కొంత ఒత్తిడికి గురవుతున్నామని ప్రతి ముగ్గురిలో ఇద్దరు చెప్తున్నారు.
ఇతరులతో కలిసి తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఒత్తిడి కారణంగా కలిగే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని తెలిపింది. కుటుంబం అంతా కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మగౌరవం కూడా పెరుగుతుందంటున్నారు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో, స్నేహితులతో కలిసి భోజనం చేయడం వల్ల సామాజిక పరస్పర చర్యలు మెరుగుపడతాయి.