ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా? నేరుగా బ్రెయిన్‌పైనే ఎఫెక్ట్!

ఉదయం, సాయంత్రం సమయాల్లో టీ, కాఫీలు తాగడం సాధారణమే. కొంత అనారోగ్యకరమైన వీటిని సేవించడం వల్ల పెద్దలపై తక్కువ చెడు ప్రభావమే ఉంటుంది. కానీ, పిల్లల్లో టీ, కాఫీలు సేవించడం వల్ల చాలా దుష్ప్రభావాలు చూపుతాయి. పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. పిల్లల మెదడు అభివృద్ధికి టీ, కాఫీలు చాలా హాని చేస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒక కప్పు కాఫీ మీ పిల్లలకు ఎంత ప్రమాదకరమో తెలుసా? నేరుగా బ్రెయిన్‌పైనే ఎఫెక్ట్!
Coffee

Updated on: Dec 29, 2025 | 3:27 PM

ఉదయం లేచిన తర్వాత, సాయంత్రంపూట చాలా మంది టీ లేదా కాఫీ సేవిస్తుంటారు. ఇది కొంత వరకు అనారోగ్య కారణమని తెలిసినా వాటిని సేవించకుండా ఉండలేరు. అయితే, పిల్లలకు మాత్రం టీ, కాఫీలు చాలా హాని కారకమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగితే పిల్లలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఐరన్ లోపానికి దారి: పిల్లలు అంటే ఎదిగేదశలో ఉన్నవారు. మనం వారి కోసం ప్రతిరోజూ పోషకాలు కలిగిన కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు లాంటి పదార్థాలను అందించాలి. కానీ, తిన్న తర్వాత ఒక కప్పు టీ గానీ, కాఫీ గానీ తాగితే.. ఆ ఆహారంలోని పోషకాలు ఏవీ శరీరానికి అందవు. వీటిలో ఉండే కొన్ని రసాయనాలు తినే ఆహారంలోని ఐరన్ రక్తంలోకి శోషించకుండా నిరోధిస్తాయి. ఫలితంగా పిల్లలు ఎంత తిన్నా.. వారు సన్నగానే ఉంటారు. రక్తహీనత ఏర్పడుతుంది. ఎప్పుడూ అలసిపోయినట్లుగా కనిపిస్తుంటారు.

కెఫిన్ మెదడుకు ప్రమాదకరం

వివిధ పనుల్లో బిజీగా ఉండే పెద్దలు ఉపశమనం కోసం కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ, పిల్లలకు కాఫీ, టీలలో ఉండే కెఫిన్.. నాడీ వ్యవస్థను అతిగా ప్రేరెపిస్తుంది. దీంతో వారిలో కొంత ఆందోళన ఏర్పడుతుంది. చదువు దృష్టి పెట్టలేరు, ఒక చోట కుదురుగా కూర్చోలేరు. అంతేగాక, ఈ కెఫిన్ వారి నిద్రను పూర్తిగా చెడగొడుతుంది. రాత్రిపూట టీ తాగే పిల్లలకు గాఢ నిద్ర రాదు. దీంతో వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. మరుసటి రోజు ఉదయం లేవగానే చిరాకుగా ఉంటారు.

ఆకలి మందగించడం

చాలా మంది తల్లులు తమ పిల్లలు ఉదయం ఎలాంటి ఆహారం తీసుకోవడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి ప్రధాన కారణం ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తాగే టీ లేదా కాఫీనే. ఇది ఆకలిని ప్రేరేపించే హార్మోన్లను అణిచివేస్తుంది. అంతేగాక, ప్రేగులలో యాసిడిటీని పెంచుతుంది. గుండెలో మంట, మలబద్ధకం, కడుపు సమస్యలను కలిగిస్తుంది. ఆకలి లేకపోతే పిల్లలు తినరు. తినకపోతే వారిలో ఎదుగుదల ఉండదు.

పిల్లలకు చక్కెర కూడా చేటే

తాగే కాఫీలో చక్కెర కూడా ఉంటుంది. అది అధిక స్థాయిలో ఉండటం కూడా పిల్లలకు హాని చేస్తుంది. పిల్లల దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. కేలరీలను పెంచి ఊబకాయులను కూడా చేసే అవకాశం ఉంది. పదేళ్ల కంటే తక్కువ వయస్సున్న పిల్లలకు పాలు, పోషక విలువలు కలిగిన గంజి లేదా పండ్ల రసాలు ఇవ్వడం చాలా మంచిది. పిల్లలు మారాం చేస్తున్నారు కదా అని టీ, కాఫీ లాంటివి తాగిస్తే వారిని ప్రమాదంలో పడేసినట్లే అవుతుంది. పిల్లల మెదడు అభివృద్ధి, శారీరక ఆరోగ్యం దెబ్బతీసినవారు అవుతారు. అధికంగా చక్కెర తీసుకుంటే పిల్లలు హైపర్ యాక్టివ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.