రోజు రోజుకీ భారత దేశం సహా ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల్లో మధుమేహ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య అధికం అవుతుంది. ఈ మధుమేహం క్రమంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. రానున్న 25 నుండి 30 సంవత్సరాలలో ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 1 బిలియన్ కంటే ఎక్కువ అవుతుందని అంచనావేస్తున్నారు. ఇందుకు సంబంధించి ది లాన్సెట్ అనే మెడికల్ జర్నల్‌లో ఓ నివేదిక ప్రచురించింది. షుగర్ పేషేంట్స్ మీద వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ పరిశోధన చేశారు.
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరంతరం పెరుగుతున్నారని యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుడు లియన్ చెప్పారు. టైప్-1 , టైప్ 2 డయాబెటిస్ వ్యాధి గ్రస్తులు సంఖ్య గణనీయంగా పెరుగుదల కనిపిస్తుంది. 1990 సంవత్సరం నుంచి 2020 వరకు ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలలో మధుమేహ రోగుల డేటా ఆధారంగా లియాన్ దీనిని నిర్ధారించారు. మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని.. రానున్న రోజుల్లో వీరి సంఖ్య మరింత అధికం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి షుగర్ పేషేంట్స్ కేసులు 1 బిలియన్ కంటే ఎక్కువ అవుతాయని తెలిపారు.
పిలల్లో మధుమేహం..
మధుమేహం లక్షణాలు చిన్నవయసులోనే కనిపిస్తున్నాయని.. ఇప్పుడు 40 ఏళ్లలోపు వారు కూడా షుగర్ వ్యాధి బారిన పడుతున్నారని.. దీంతో షుగర్ వ్యాధి గ్రస్తుల కేసులు పెరుగుతున్నాయని పరిశోధనలో తేలింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, పశ్చిమాసియాలో షుగర్ పేషేంట్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మధుమేహం వ్యాధిగ్రస్తులున్నారని లెక్కల ద్వారా తెలుస్తోంది. అయితే ఇతర దేశాలతో పోలిస్తే కరేబియన్ దేశాల్లో మధుమేహం కేసుల పెరుగుదల రేటు తక్కువగా ఉంది.
ఎందుకు వేగంగా వ్యాపిస్తోందంటే..
మధుమేహం ఇలా వేగంగా పెరగడానికి కారణం మానవ జీవన శైలి, ఆహారపు అలవాట్లు అని అంటున్నారు. తగ్గిన శారీరక శ్రమ, నిశ్చల జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని లియోన్ చెప్పారు. జన్యుపరమైన కారణాల వలన వచ్చే షుగర్ వ్యాధిగ్రస్థులకంటే కూడా.. ఈ రెండు కారణాల వల్లనే డయాబెటిస్ వ్యాధి బాధితుల సంఖ్య పెరుగుతోంది. మధుమేహం బారిన పడిన వారి శరీరంలోని ఇతర భాగాలు కూడా పాడవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గుండె, కిడ్నీ, కళ్లకు సంబంధించిన తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. కనుక ప్రజలు అప్రమత్తం అవ్వాలని.. మధుమేహం బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి నివారణకు కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. జీవన శైలీని క్రమబద్దీకరించుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..