షుగర్ ఫ్రీ లైఫ్.. రోజువారీ జీవితంలో ఈ అలవాట్లతో డయాబెటిస్‌కు గుడ్ బై చెప్పండి..!

మన శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలు కంట్రోల్‌లో ఉండటం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి పెరిగితే డయాబెటిస్‌తో పాటు గుండె, కిడ్నీ, కళ్ల సమస్యలు కూడా రావచ్చు. కానీ సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలిని పాటించడం ద్వారా చక్కెర స్థాయిలను సహజంగానే తగ్గించుకోవచ్చు.

షుగర్ ఫ్రీ లైఫ్.. రోజువారీ జీవితంలో ఈ అలవాట్లతో డయాబెటిస్‌కు గుడ్ బై చెప్పండి..!
Diabetes

Updated on: Aug 18, 2025 | 7:19 PM

మన శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్‌ లో ఉండటం చాలా ముఖ్యం. ఇవి పెరిగిపోతే డయాబెటిస్ లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఈ జబ్బు ఎక్కువగా వృద్ధులలోనే కనిపించేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ వస్తోంది. డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీ, కళ్ళు లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే మనం రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లు పాటిస్తే బ్లడ్ షుగర్‌ను సహజంగా అదుపు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆహారం

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం చక్కెరను అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది. ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, ఆహారం నుండి చక్కెర రక్తంలో త్వరగా చేరకుండా చూస్తుంది. కాబట్టి కూరగాయలు, పండ్లు, పప్పులు, తృణధాన్యాలు ఎక్కువగా తినడం మంచిది. అలాగే చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు (తెల్ల బియ్యం, స్వీట్లు, తెల్ల రొట్టె) తగ్గించాలి. టీ, కాఫీలో చక్కెర తక్కువగా వాడాలి.

వ్యాయామం

రోజువారీ వ్యాయామం శరీర బరువును అదుపులో ఉంచడమే కాకుండా.. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగానే తగ్గుతాయి. నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ లాంటి వ్యాయామాలు చాలా మంచివి. అలాగే సరిపడినంత నిద్ర కూడా చాలా ముఖ్యం.

ఒత్తిడి

ఒత్తిడి పెరిగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే ఒత్తిడి సమయంలో కార్టిసాల్, గ్లూకాగాన్ అనే హార్మోన్లు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి బ్లడ్ షుగర్‌ను పెంచుతాయి. కాబట్టి యోగా, ధ్యానం, వ్యాయామం లాంటివి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

సరిపడా నీరు

రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న ఎక్కువ చక్కెర మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. పరిశోధనల ప్రకారం.. ఎక్కువ నీరు తాగే వారికి బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ముఖ్యమైన సూచనలు

  • పొగ తాగడం, మద్యం సేవించడం మానుకోవాలి.
  • డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.
  • మీ చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి.

ఈ సూచనలు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అదుపు చేయడంలో సహాయపడతాయి. అయితే ఇప్పటికే డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతో పాటు వీటిని పాటించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)