
కరివేపాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు మాత్రమే ఉపయోగపడుతుందనే ఆలోచన చాలా మందిలో ఉంది. కానీ ఇది అనేక వ్యాధులకు దివ్య ఔషధం కూడా. శరీరం నుండి విష పదార్థాలను తొలిగంచే శక్తి కరివేపాకుకు ఉంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటం, మధుమేహాన్ని నియంత్రించడం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండటం వంటి ఉపయోగాలు ఉన్నాయి. అదనంగా ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకులను పచ్చిగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి కరివేపాకులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
ఈ ఆకులలో కార్బజోల్, ఆల్కలీన్ ఉంటాయి. ఇవి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 5 నుండి 7 ఆకులను నమిలితే, మీ బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది. లేకపోతే టీ చేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. టీ రుచిగా ఉండేందుకు అవసరమైతే నిమ్మరసం, తేనే జోడించకోవచ్చు. ఇది మీ శరీరం నుండి అదనపు కొవ్వును తగ్గించడమే కాకుండా మలినాలను కూడా తొలగిస్తుంది. 1 నెలలో మీ బరువులో తేడా కనిపిస్తుంది. అంతేకాకుండా కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్లు మీ జీవక్రియను పెంచుతాయి.
కరివేపాకులో మెగ్నీషియం, ఫైబర్, పాస్పరస్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది. కరివేపాకులో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. కరివేపాకు మెదడు పనితీరును మెరుగుపరిచి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కరివేపాకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ సహాయపడుతుంది