Covid Booster Dose: చదువు, ఉద్యోగాలు, ఇంకా వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళ్లేవారు బూస్టర్ డోస్ కోసం తొమ్మిది నెలలు ఆగాల్సిన అవసరం లేదు. సెకండ్ డోస్ తర్వాత మూడు నెలలు గడిస్తే బూస్టర్ డోస్ వేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రాలు, యుటిల సమావేశంలో ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. విదేశాల్లో అమలవుతున్న నిబంధనలకు అనుగుణంగా ముందుగానే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవచ్చన్నారు. పద్దెనిమిదేళ్లకు పైబడి 59 ఏళ్ల లోపు వయసు వారు బూస్టర్ డోస్‌ను తీసుకోవచ్చు.
అయితే కోవిడ్ టీకా కేంద్రాలు విదేశాలకు వెళ్లేవారిని బూస్టర్ డోస్ కోసం ఎటువంటి పత్రాలు అడగకూడదని భూషణ్ సూచించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకి ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో పౌరులు వీసా వంటి పత్రాలను CoWIN పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. దీంతో వ్యాక్సిన్ సెంటర్లలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఎటువంటి పత్రాలు అవసరం లేదని కేంద్రం చెబుతోంది కానీ దీనివల్ల నకిలీ వ్యక్తులు కూడా బూస్టర్ డోస్ కోసం డిమాండ్ చేసే అవకాశాలున్నాయని వ్యాక్సిన్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సచిన్ దేశాయ్ మాట్లాడుతూ టీకా కేంద్రాలుఅవసరమైతే నిర్ణీత సమయంలో కొన్ని ప్రయాణ పత్రాల కోసం అడగవచ్చు. అయితే విదేశాలకు వెళ్లనివారు బూస్టర్ డోస్ కోసం డిమాండ్ చేసే అవసరం ఏముంటుందని పేర్కొన్నారు.
అయితే వృద్ధులు, హెల్త్ వర్కర్స్, ఫ్రంట్‌లైన్ వర్కర్స్ వంటివాళ్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. బూస్టర్ డోస్‌కు అర్హత కలిగిన పౌరులు ఎవరైనా ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తాజాగా సవరించిన మార్గదర్శకాల ప్రకారం విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఇతరులు ఎవరైనా ఆ దేశ నిబంధనలకు అనుగుణంగా ముందుగానే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి