Pineapple Juice – Summer: వేసవిలో ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పలు రకాల జ్యూస్‌లు తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే పలు రకాల జ్యూస్‌లు ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు శరీరాన్ని కూల్‌గా ఉంచుతాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అయితే.. పైనాపిల్ జ్యూస్ ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైనాపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీంతోపాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని అనేక సమస్యలను దూరం చేస్తాయి. అయితే పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తపోటు నుంచి ఉపశమనం: వేసవిలో రక్తపోటు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. బీపీతో బాధపడుతున్నవారు పైనాపిల్ జ్యూస్ తాగడం చాలామంచిది. దీనివల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే ఆహారంలో పైనాపిల్ ను చేర్చుకోవడం మంచిది.
బరువు తగ్గుతుంది: బరువు తగ్గడానికి ఆహారంలో పైనాపిల్ జ్యూస్‌ని కూడా చేర్చుకోవచ్చు. దీనిలో విటమిన్ సితో పాటు పీచు పదార్థాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. మీ శరీర బరువును తగ్గించుకోవాలనుకుంటే ఖచ్చితంగా పైనాపిల్ తినడం మంచిది.
రోగనిరోధక శక్తి: రోజూ పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు శరీరంలోని బ్యాక్టీరియాను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా సహాయపడతాయి.
ఆర్థరైటిస్: వేసవిలో ఆర్థరైటిస్ సమస్యను అధిగమించడానికి పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. వాస్తవానికి ఇందులో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, తిమ్మిరి మొదలైనవాటిని తగ్గిస్తాలీ. ఇదేకాకుండా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపు, నొప్పిని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
ఎముకలు: పైనాపిల్ జ్యూస్ ఎముకలను దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కాల్షియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి దంతాలు, ఎముకలను బలోపేతం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. దీనితో పాటు, ఎముకలు, దంతాల నొప్పిని కూడా తగ్గిస్తాయి.
(ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. TV9 తెలుగు వీటిని ధృవీకరించడంలేదు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే దీన్ని అనుసరించండి.)
Also Read: