
టూత్ పేస్ట్ తో బ్రష్ చేసిన వెంటనే పేస్ట్ ను ఉమ్మివేసి ఆ తర్వాత నోటిని క్లీన్ చేసుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసేదే. అయితే, ఇలా చేయడం వల్ల దంతాలను మనమే డ్యామేజ్ చేసుకున్న వారమవుతాం. ఎందుకంటే మనం బ్రషింగ్ కోసం పేస్టును వాడే అతి ముఖ్య కారణాల్లో ఒకటి అందులో ఉండే ఫ్లోరైడ్. ఇది పళ్ల మీద ఉండే ఎనామిల్ ను కాపాడుతూ.. కేవిటీలను రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్రష్ చేసిన వెంటనే దీనిని దంతాలపై కాసేపు ఉండనివ్వాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నోట్లో ఉండే పేస్టు నురగను బయటకు ఉమ్మివేసిన తర్వాత పళ్లపై పేస్టు పలుచటి పొరలాగా కాసేపు ఉండనివ్వాలి. అప్పుడే అందులో ఉండే ఫ్లోరైడ్ పళ్లకు పట్టుకుని ఉండి ఒక కోటింగ్ ను ఏర్పాటు చేస్తుంది. ఇది మన పళ్లకు ఎంతో రక్షణగా పనిచేస్తుంది. తర్వాతి కాలంలో పళ్లు వదులవడం, ఇతరత్రా పళ్ల సమస్యలు వంటివి రాకుండా ఉంటాయట.
ఫ్లోరైడ్ అనేది నోటిలో ఉత్పత్తి అయ్యే బ్యాక్టీరియా నుంచి పళ్ల ఎనామిల్ ను రక్షించేది. ఇది ముఖ్యంగా పళ్లపై పసుపు మరకలు రాకుండా చేస్తుంది. ఇదే ఫ్లోరైడ్ ఎక్కువ మొత్తంలో పళ్లను తాకినప్పుడు దాని కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. టూత్ పేస్టులో ఉండే మేలు చేసే ఫ్లోరైడ్ స్పటిక రూపంలో మారిపోయి పళ్ల నిర్మాణంలో కలిసిపోతుంది. అప్పుడది ఫ్లోరాపటైట్ అనే ఖనిజాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కాల్షియం, ఫాస్ఫేట్, అయాన్ లను పంటి మీద కోటింగ్ లా ఉంచుతుంది.
దంత వైద్యులు ఫ్లోరైడ్ ను టూత్ పేస్టులో చాలా ముఖ్యమైన పదార్థంగా అభివర్ణిస్తారు. అయితే ఇది పిల్లలు, ఫ్లోరోసిస్ (దంతాలు రంగు మారడం )వంటి సమస్య ఉన్న వారు ఫ్లోరైడ్ కలిగిన టూత్ పేస్టులను వాడకుండా ఉండాలి. పళ్లు తోముకునేటప్పుడు అనుకోకుండా పేస్టును మింగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్టులను పిల్లలకు ఉపయోగించరాదని వైద్యులు సూచిస్తుంటారు.
ఫ్లోరైడ్ లేని టూత్ పేస్టును వాడేటప్పుడు నో రిన్స్ నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కానీ, ఫ్లోరైడ్ లేని టూత్ పేస్టులు దంతక్షయం నుంచి పూర్తి స్థాయిలో మీ పళ్లను రక్షించలేదు. అయితే, ఇది రోజూ నోటిని శుభ్రం చేసుకునేందుకు ఒక సాధారణ టూత్ పేస్టులాగా పనిచేస్తుంది.