
సాధారణంగా మనం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మన బ్లడ్ గ్రూప్ ఏంటనేది తెలుసుకోవాలనుకుంటాం. కానీ ప్రముఖ జర్నల్ ఫ్రాంటియర్స్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. మన బ్లడ్ గ్రూప్ మన ఆరోగ్యం గురించి చాలా విషయాలను చెప్పగలదు. ముఖ్యంగా కొన్ని రక్త వర్గాలు ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది
ఈ అధ్యయనం ప్రకారం..A బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధులు వచ్చినప్పుడు, మన రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన కాలేయంపై దాడి చేసి, దాన్ని దెబ్బతీస్తుంది. పరిశోధకులు సుమారు 1,200 మందిని పరీక్షించగా.. వీరిలో 114 మందికి ఆటో ఇమ్యూన్ కాలేయ వ్యాధి ఉంది. కాలేయ సమస్యలు ఉన్నవారిలో A రక్త వర్గం ఎక్కువగా ఉండగా ఆ తర్వాత O, B మరియు AB గ్రూపులు ఉన్నాయి.
దీనికి విరుద్ధంగా B బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కాలేయ వ్యాధుల ప్రమాదం చాలా తక్కువగా ఉంది. వారు ప్రైమరీ బిలియరీ కోలాంగైటిస్ అనే దీర్ఘకాలిక కాలేయ వ్యాధి బారిన పడే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ వ్యాధిలో పిత్త వాహికలు దెబ్బతింటాయి. పిత్తం కాలేయంలో పేరుకుపోతుంది. ఇది చివరికి సిరోసిస్, కాలేయ వైఫల్యానికి దారితీయవచ్చు.
మీ బ్లడ్ గ్రూప్ A అయినంత మాత్రాన మీకు ఖచ్చితంగా కాలేయ వ్యాధి వస్తుందని కాదు. కానీ ఇది ప్రమాద కారకం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా అలసట, కీళ్ల నొప్పులు వంటి చిన్న లక్షణాలు కనిపించినా తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం, వ్యాధులను ముందస్తుగా గుర్తించడం, చికిత్స పొందడం కాలేయానికి మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..