స్టైల్, ఎనర్జీ కోసం అవి తాగేస్తున్నారా? సైలెంట్ కిల్లర్స్ గురించి షాకింగ్ సీక్రెట్స్

పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌లు లేదా స్నేహితులతో కలిసి ఆడుకునే సమయాల్లో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. ‘తాగితే ఎనర్జీ వస్తుంది, రిఫ్రెష్ అవుతాం’ అని ప్రకటనలు చూసి ఎంతోమంది ఇవి మంచివని నమ్మేస్తున్నారు. కానీ, నిజంగా ఈ పానీయాలు మీ శరీరానికి శక్తిని ఇస్తున్నాయా లేక లోలోపల మీ అవయవాలను బలహీనపరుస్తున్నాయా? ప్యాకెట్లలో దొరికే ఈ రంగుల పానీయాల వెనుక ఉన్న అసలు ప్రమాదకర నిజాన్ని నిపుణులు వెల్లడిస్తున్నారు.

స్టైల్, ఎనర్జీ కోసం అవి తాగేస్తున్నారా? సైలెంట్ కిల్లర్స్ గురించి షాకింగ్ సీక్రెట్స్
Energy Drinkss

Updated on: May 23, 2026 | 8:00 PM

వేసవి కాలమైనా, ఏదైనా సంబరమైనా మన చేతిలో కూల్ డ్రింక్ ఉండాల్సిందే! అయితే, అప్పటికప్పుడు ఇచ్చే ఆ చిన్నపాటి రిఫ్రెష్‌మెంట్ కోసం మీరు మీ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయం గ్రహించారా? అధిక చక్కెర, కృత్రిమ రసాయనాలు కలిగిన ఈ ఎనర్జీ డ్రింక్స్, సోడాలు మన జీవక్రియలను ఎలా దెబ్బతీస్తాయో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. ఆరోగ్యకరమైన జీవితాన్ని కోరుకునే వారు తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం..

ఆధునిక జీవనశైలిలో పార్టీలు, క్రికెట్ మ్యాచ్‌లు, ఆటల సందర్భాల్లో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తాగడం సర్వసాధారణమైపోయింది. ఈ పానీయాలలోని అధిక చక్కెర, కెఫీన్, ఇతర హానికరమైన రసాయనాలు దీర్ఘకాలంలో డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు, ఊబకాయం వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

హాని చేసే పానీయాల జాబితా..

  • ఎనర్జీ డ్రింక్స్: వీటిలో ఉండే అధిక కెఫీన్ మరియు స్టిమ్యులంట్స్ హృదయ స్పందన రేటును, రక్తపోటును ఒక్కసారిగా పెంచుతాయి. రోజూ వీటిని తాగే అలవాటు ఉన్నవారికి నిద్రలేమి, తీవ్రమైన ఆందోళన, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
  • డైట్ సోడాలు: ఇవి సున్నా క్యాలరీలని ప్రచారం జరిగినా, వీటిలోని ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ మన పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. ఇది మైక్రోబయోమ్‌ను అసమతుల్యం చేసి, చక్కెర తినాలనే కోరికను పెంచుతుంది. చివరకు ఊబకాయం, మెటబాలిక్ సమస్యలకు దారితీస్తుంది.
  • ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్: పండ్ల రసాల పేరుతో వచ్చే వీటిలో ఫ్రక్టోజ్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అస్సలు ఉండదు. ఇవి రక్తంలో చక్కెరను వేగంగా పెంచి, ఇన్సులిన్ స్పైక్స్ కలిగిస్తాయి. ఫలితంగా ఫ్యాటీ లివర్, డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
  • స్పోర్ట్స్ డ్రింక్స్: ఇవి తీవ్ర వ్యాయామం చేసే అథ్లెట్ల కోసం మాత్రమే. సాధారణ వ్యక్తులు అలవాటుగా తాగితే, ఇందులోని అధిక చక్కెర, సోడియం కారణంగా రక్తపోటు, ఊబకాయం మరియు డీహైడ్రేషన్ సమస్యలు వస్తాయి.
  • ఫ్లేవర్డ్ మిల్క్: చాక్లెట్ లేదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న పాలలో చక్కెర శాతం విపరీతంగా ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు కారణమవుతాయి.

ప్రత్యామ్నాయం ఏంటి?

ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగే అలవాటును తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి మంచిది. వీటికి ప్రత్యామ్నాయంగా సహజమైన పానీయాలను ఎంచుకోండి.

  • స్వచ్ఛమైన మంచి నీరు: శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ఇదే ఉత్తమ మార్గం.
  • నిమ్మరసం: విటమిన్ సి అందిస్తూ, శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
  • కొబ్బరి నీళ్లు: ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉండి, సహజమైన ఎనర్జీనిస్తాయి.
  • హెర్బల్ టీలు: యాంటీ ఆక్సిడెంట్స్ తో ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

అధిక చక్కెరలు, రసాయనాలు కలిగిన పానీయాలను తాగుతూ మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దు. ప్రకృతి ప్రసాదించిన పానీయాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. సంతోషకరమైన పార్టీలు కావాలి, కానీ ఆరోగ్యకరమైన పానీయాలతోనే ఆ సంతోషాన్ని ఆస్వాదించండి. ఆరోగ్యమే మహాభాగ్యం!

Follow Us