Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే ఈ పానీయాలను రోజూ డైట్ లో చేర్చుకోండి..

Weight Loss Tips: ఈ రోజుల్లో దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవాల్సిందే.

Weight Loss Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే ఈ పానీయాలను రోజూ డైట్ లో చేర్చుకోండి..
Weightloss

Updated on: Jun 14, 2022 | 9:01 PM

Weight Loss Tips: ఈ రోజుల్లో దేశంలో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అధిక బరువు. ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే మంచి జీవనశైలిని అలవర్చుకోవాల్సిందే. అధిక బరువు కారణంగా చాలా మంది ఆందోళన చెందుతున్నారు. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. వేగంగా బరువు తగ్గడానికి, మీరు ఆహారంలో అనేక రకాల ఆరోగ్యకరమైన పానీయాలను కూడా చేర్చుకోవచ్చు. ఈ పానీయాలు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు, మూలికలను ఉపయోగించి తయారు చేస్తారు. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపేందుకు అద్బుతంగా పనిచేస్తాయి. ఇవి మెటాబాలిజం రేటును వేగవంతం చేస్తాయి. తద్వారా వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది . ఏఏ హెల్తీ డ్రింక్స్ డైట్ లో చేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

జీలకర్ర నీరు:

మీరు బరువు తగ్గడానికి జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం.. ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే ఈ నీటిని వడకట్టండి. ఈ నీటిని తక్కువ వేడిలో మరిగించండి. ఆ తరువాత చిటికెడు నల్ల ఉప్పు వేసి సేవించాలి.

వాము నీరు:

వాము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీవక్రియను వేగవంతం జరిగేందుకు సహకరిస్తుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయం చేయడానికి, ఒక టీస్పూన్ వాము నీటిలో ఉడకబెట్టండి. దీనికి నిమ్మరసం, నల్ల ఉప్పు కలిపి సేవించాలి.

పసుపు నీరు:

పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ పానీయం చేయడానికి.. ఒక పాత్రలో రెండు కప్పుల నీటిని తీసుకోండి. దానికి చిటికెడు పసుపు వేయాలి. ఈ నీటిని మరిగించండి. నీరు చల్లార్చుకుని తాగాలి. రుచిని మెరుగుపరచడానికి మీరు దీనికి కొంచెం తేనెను కూడా కలుపుకోవచ్చు.

అల్లం – నిమ్మకాయ నీరు:

అల్లం, నిమ్మరసం కలిపిన నీరు వికారం, అజీర్ణం, పొట్టకు సంబంధించిన అనేక సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. దీన్ని తయారు చేయడానికి.. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి.. అందులో అల్లం రసం కలుపుకుని తాగాలి. ఇది బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది.

నిమ్మ – తేనె నీరు:

నిమ్మకాయ, తేనె కలిపిన నీరు జీవక్రియను వేగవంతం చేయడానికి ఎంతగానో దోహద పడుతుంది. ఇది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మకాయను పిండి దీనిని తయారు చేసుకోవచ్చు. అందులో తేనె కలుపుకుని ఉదయాన్నే సేవించటం ఆరోగ్యానికి చాలా మంచిది.