మన స్మార్ట్ ఫోన్‌లోని ఆరోగ్య సేతు యాప్ ఏం చేస్తోంది..? కేవలం స్టేటస్ చెప్పడమేనా..? ఆరోగ్య సేతుతో మనకు లాభం ఏంటి..? ఇలాంటి చాలా ప్రశ్నలకు ఆరోగ్యసేతు యాప్ నిర్వాహకులు కొత్త అప్‌డేట్స్ తీసుకొచ్చారు. మీరు కోవిడ్ టీకా తీసుకోవడంతో అందులో వెంటనే మార్పులు కనిపిస్తాయి. కరోనా మొదటి దశలో విశేష సేవలందించింది ఆరోగ్యసేతు యాప్ ఇప్పుడు కూడా అదే తరహాలో అందిస్తోంది. వైరస్ పై ప్రజలను ఎప్పటికప్పుడు సమాచారం అందించడం. అయితే ప్రస్తుతం వైరస్ సమాచారం, టీకా రిజిస్ట్రేషన్లతో పాటు మరో వ్యక్తి వ్యాక్సినేషన్ స్టేటస్‌ను చూపిస్తోంది.
తొలి దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌ను పరిచయం చేసింది. ఆరోగ్యసేతు యాప్.. కరోనా వైరస్‌పై ప్రజలను ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని అందిస్తోంది. ప్రస్తుతం దాని నిర్వహణను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ చూస్తోంది. ప్రజల్ని కరోనా నుంచి సురక్షితంగా ఉంచేందుకు ఎప్పటికప్పుడు ఆ యాప్‌లో తగిన సమాచారం అందుబాటులో ఉంచేది. కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చాక.. కొవిన్ పోర్టల్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్‌లో కూడా కరోనా టీకా బుకింగ్‌కు వీలుకల్పించింది.
అలాగే వైరస్ సమాచారంతో పాటు టీకా రిజిస్ట్రేషన్ వివరాలను దానిలో పొందుపరిచింది. తాజాగా ఆ యాప్‌లో మరో అప్‌డేట్ వచ్చింది. దానిలో భాగంగా ఇకనుంచి టీకా తీసుకున్న వారి స్టేటస్ కనిపిస్తుంది. ఒక టీకా డోసు తీసుకున్న వ్యక్తి పేరు పక్కన ఒక బ్లూ మార్క్, రెండు డోసులు పూర్తయితే రెండు బ్లూ టిక్ మార్కులు కనిపిస్తాయి. రెండు బ్లూ టిక్ మార్కులు కనిపిస్తే.. వ్యాక్సినేషన్ పూర్తయినట్లని ఆరోగ్య సేతు ట్విట్టర్‌లో వెల్లడించింది.