Maternal mortality: ప్రతి రెండు నిమిషాలకో ప్రసూతి మరణం.. డబ్ల్యూహెచ్ఓలో నివేదికలో ఆందోళనకర విషయాలు..
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఓ ప్రసూతి మరణం సంభవిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయితే మొత్తం మీద ప్రసూతి లేదా ప్రసవ మరణాలు తగ్గినా, పరిస్థితి ఇంకా ఆందోళనకరమేనని పేర్కొంది.

మహిళకు ప్రతి ప్రసవం ఓ పునర్జమ్మ లాంటిదే. ప్రతి స్త్రీ గర్భధారణ వరం అయినా.. ఆ వరమే కొన్ని సందర్భాల్లో వారి పాలిట ఉరితాడవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రెండు నిమిషాలకు ఓ ప్రసూతి మరణం సంభవిస్తోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయితే మొత్తం మీద ప్రసూతి లేదా ప్రసవ మరణాలు తగ్గినట్లు వెల్లడించింది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏం జరుగుతుంది?
గర్భధారణ సమయంలో స్త్రీలు వివిధ రకాల శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భాధారణ కాలం మొత్తం ఒక ఎత్తు అయితే ప్రసవం మరో ఎత్తు. స్త్రీకి ప్రసవం పునర్జన్మలాంటిది. ఎందుకంటే డెలివరీ సమయంలో వారు తీవ్రమైన బాధను అనుభవిస్తారు. ఆ సమయంలో శరీరం నుండి అధిక రక్తస్రావం జరుగుతుంది. దీని కారణంగా చాలా మంది మహిళలు చనిపోతారు.
ఐక్యరాజ్య సమితి చెప్పిందిదే..
గత 20 ఏళ్లలో ప్రసూతి మరణాల రేటు మూడో వంతు తగ్గినప్పటికీ, ప్రసూతి ప్రసవ సమస్యలతో ప్రతీ రెండు నిమిషాలకు ఒక మహిళ మృతి చెందుతున్నట్లు ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఓ నివేదికలో ప్రకటించింది. అయితే 2000-2015 మధ్య ప్రసూతి మరణాలు గణనీయంగా తగ్గాయని, 2016 నుంచి 2020 వరకూ కొన్ని దేశాల్లో ఆ సంఖ్య నిలకడగా ఉన్నాయని పేర్కొంది. అయితే మరికొన్ని దేశాల్లో ఆ పరిస్థితి తారుమారు అయ్యిందని వివరించింది. 2016 నుండి ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాలు మాత్రమే ప్రసూతి మరణాల రేటుని గణనీయంగా తగ్గించగలిగాయని తెలిపింది.



మరణాలు తగ్గినా ఆందోళనే..
గత 20 ఏళ్ల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు 34.3 శాతానికి తగ్గింది. 2000లో ప్రతీ లక్ష జననాలకు 339గా ఉన్న ప్రసూతి మరణాల సంఖ్య 2020 నాటికి 223కు తగ్గింది. అయినప్పటికీ 2020లో అంతర్జాతీయ స్థాయిలో 2,87,000 ప్రసూతి మరణాలు నమోదయ్యాయి. ఈ లెక్కన రోజుకు సుమారు 800 మంది మరణించారు. అంటే ప్రతీ రెండు నిమిషాలకు ఒకరు మరణించారు.
ప్రధాన కారణాలు ఇవే..
ప్రసూతి మరణాలకు ప్రధాన కారణం అధిక రక్తస్రావం, హై బిపి, జెస్టేషనల్ డయాబెటిస్, గర్భాధారణ సంబంధిత అంటువ్యాధులు, లోబిపి, అసురక్షితమైన అబార్షన్ తో పాటు హెచ్ ఐవి, ఎయిడ్స్, మలేరియా వంటి కారణాలు ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనాం ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ గర్భం దాల్చిన సమయం ఆశలు, ఆకాంక్షలతో మంచి ఆలోచనలు, సానుకూల అనుభవాలతో నిండి ఉండాలిగానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భయానక అనుభవాలను ఎదుర్కోవాల్సి రావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భం దాల్చే సమయం వంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలని నొక్కి చెప్పారు.
ఈ దేశాల్లో అధికం..
- 2016 నుంచి 2020 వరకూ ప్రసూతి మరణాల రేటు కేవలం రెండు ప్రాంతాల్లో మాత్రమే తగ్గింది. ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌లో 35 శాతం, మధ్య దక్షిణాసియాలో 16 శాతం తగ్గింది.
- యూరప్, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో 17 శాతం, లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో 15 శాతం పెరిగింది.
- రెండు యూరోపియన్ దేశాలు గ్రీస్, సైప్రస్‌లో ఈ రేటు గణనీయంగా పెరిగింది. ప్రపంచంలో పేద దేశాలు, సంఘర్షణా ప్రభావిత దేశాల్లో ప్రసూతి మరణాలు ఎక్కువగా కేంద్రీకృతమైన ఉన్నాయి.
- 2020లో నమోదైన మరణాల్లో 70 శాతం ఆఫ్రికాలో ఉన్నాయని, ఇక్కడ మరణాల రేటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంటే 136 రెట్లు ఎక్కువగా నమోదైంది.
- అలాగే మానవతా సంక్షోభాలను ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, చాడ్, డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సోమాలియా, దక్షిణ సుడాన్, సిరియా, యెమెన్ వంటి దేశాల్లో ఈ రేటు ప్రపంచ సగటు కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంది.
ఇదే లక్ష్యం..
2030 నాటికి 1 మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళల జీవితాలను ప్రమాదంలో పడకుండా కాపాడాలని అందుకు ప్రసూతి మరణాలను తగ్గించాలని ఆ నివేదిక ప్రకటించింది. ఆ దిశగా ప్రపంచ దేశాలు లక్ష్యాలను నిర్ధేశించుకొని చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేసింది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
