
విరేచనాలు అవ్వడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గిపోవడం) సమస్య తలెత్తుతుంది. అందుకే ఈ సమయంలో పొట్టకు విశ్రాంతిని ఇస్తూ, సులభంగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విరేచనాలను అడ్డుకోవడానికి మన ఇంట్లోనే లభించే 5 అద్భుతమైన హోం రెమెడీస్ ఇవే..
1. ఓఆర్ఎస్ (ORS) లేదా ఉప్పు-చక్కెర ద్రావణం:
విరేచనాలు అవుతున్నప్పుడు శరీరంలో లవణాలు (ఎలక్ట్రోలైట్స్) తగ్గిపోతాయి. దీనిని నివారించడానికి ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిలో ఒక చెంచా చక్కెర, చిటికెడు ఉప్పు కలిపి కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఇది శరీరానికి ఇన్స్టంట్‌గా ఎనర్జీని ఇస్తుంది. నిమ్మరసం నీళ్లు లేదా కొబ్బరినీళ్లు తాగడం కూడా ఎంతో మంచిది.
2. పెరుగు లేదా మజ్జిగ:
పెరుగులో ఉండే ‘ప్రోబయాటిక్స్’ (మంచి బ్యాక్టీరియా) పొట్టలోని ఇన్ఫెక్షన్ కలిగించే చెడు బ్యాక్టీరియాతో పోరాడుతాయి. విరేచనాల సమయంలో ఒక కప్పు చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, ఉప్పు వేసుకుని తాగితే పొట్ట సల్లబడుతుంది మరియు విరేచనాలు త్వరగా తగ్గుముఖం పడతాయి.
3. అరటిపండు :
లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు తినడానికి అరటిపండు ఒక ఉత్తమమైన ఆహారం. ఇందులో ఉండే ‘పెక్టిన్’ అనే ఫైబర్, లూజ్ గా అయ్యే మోషన్స్ ను గట్టిపడేలా చేస్తుంది. అలాగే అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల నీరసం తగ్గి, శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
4. దానిమ్మ రసం :
దానిమ్మ పండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. విరేచనాలు వేధిస్తున్నప్పుడు ఒక గ్లాసు తాజా దానిమ్మ రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. ఒకవేళ వీలైతే దానిమ్మ చెట్టు ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటిని వడకట్టి తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
5. మెంతి గింజలు లేదా జీలకర్ర:
ఒక చెంచా జీలకర్రను నీటిలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని చల్లార్చి రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగాలి. జీలకర్రలో ఉండే యాంటీ మైక్రోబియల్ గుణాలు పొట్ట సమస్యలను నయం చేస్తాయి. అలాగే ఒక చెంచా మెంతులను నమిలి తిని, ఆపై మజ్జిగ తాగినా కూడా విరేచనాలు త్వరగా ఆగిపోతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
విరేచనాలు అవుతున్నప్పుడు టీ, కాఫీ, మసాలా ఆహారాలు, వేపుళ్లు, మరియు పాల పదార్థాలకు (మజ్జిగ, పెరుగు మినహా) దూరంగా ఉండాలి. ఒకవేళ రెండు రోజులు దాటినా సమస్య తగ్గకపోతే లేదా మలంలో రక్తం పడితే ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
గమనిక : ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న చిట్కాలు, సమాచారం సాధారణ ఆరోగ్య సూచనల ప్రాతిపదికన అందించబడ్డాయి. ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉంటే లేదా చిన్న పిల్లలకు ఈ సమస్య వస్తే సొంత వైద్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.