భోజనం తర్వాత చిటికెడు సోంపు.. చిన్న గింజల్లో పెద్ద అద్భుతం
భోజనం తర్వాత సోంపు గింజలు నమలడం కేవలం నోటి తాజాదనానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సోంపు జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను నివారించడం, కంటి ఆరోగ్యాన్ని కాపాడటం, చర్మ కాంతిని పెంచడం, బరువు నియంత్రణకు తోడ్పడటం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే సోంపు గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ, జీవక్రియ మెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది..

మనలో చాలామందికి భోజనం చేసిన తర్వాత సోంపు గింజలు నమలడం అలవాటుగా ఉంటుంది. సాధారణంగా నోటి దుర్వాసన పోవడానికి లేదా రుచికోసం తీసుకునే ఈ సోంపు గింజల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వంటగదిలో సులభంగా దొరికే ఈ మసాలా దినుసు జీర్ణక్రియ నుంచి గుండె ఆరోగ్యం వరకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భోజనం తర్వాత సోంపు గింజలు తినడం వల్ల జీర్ణరసాలు, ఎంజైమ్‌ల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవడంతో పాటు అజీర్ణం, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత కొద్దిగా సోంపు నమలడం జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
నోటి దుర్వాసనకు చెక్
సోంపులో ఉండే సహజ సుగంధ తైలాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. భోజనం తర్వాత సోంపు తీసుకోవడం వల్ల శ్వాస తాజాగా ఉండటమే కాకుండా నోటి పరిశుభ్రత కూడా మెరుగుపడుతుంది. సోంపులో విటమిన్-ఎ, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడటంతో పాటు దృష్టి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
చర్మానికి సహజ కాంతి
సోంపులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు అకాల వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి. చర్మం సహజ కాంతిని సంతరించుకోవడంలో కూడా సోంపు సహాయపడుతుంది. సోంపు ఆకలిని నియంత్రించే లక్షణాలు కలిగి ఉంటుంది. దీనిని నమలడం వల్ల కడుపు నిండిన భావన కలిగి చిరుతిండ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో బరువు నియంత్రణలో సహాయపడుతుంది.
రక్తపోటు నియంత్రణ
సోంపులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యం చేయడంలో సహాయపడటంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. సోంపులోని పోషకాలు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే జీవక్రియను మెరుగుపరచి శరీరాన్ని ఉత్సాహంగా, చురుకుగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి కూడా తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ భోజనం తర్వాత చిటికెడు సోంపు తినడం చిన్న అలవాటుగా అనిపించినా, అది జీర్ణక్రియ, నోటి ఆరోగ్యం, చర్మం, గుండె ఆరోగ్యం వంటి అనేక అంశాల్లో మేలు చేస్తుంది. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేక చికిత్సలు తీసుకుంటున్నవారు వైద్యుల సలహా మేరకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం మంచిది.




