సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో పలువురు సినీ ప్రముఖులు మరణించగా.. పలువురు అకాల మరణంతో కొందరు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. పునీత్ రాజ్ కుమార్ నుంచి ఇటీవల శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖుల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్లా్క్ బస్టర్ సినిమాలకు పనిచేసిన డైరెక్టర్ త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో మృతి చెందారు. అయితే ఆయన రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభు హీరోగా వెట్రిమేల్ వెట్రి, విజయకాంత్ హీరోగా మా నగర్ కావలన్ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు త్యాగరాజన్.
అరంబుకోట్టైకి చెందిన త్యాగరాజన్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి. పొన్నుపార్క పరేన్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి వెట్టిమేల్ వెట్రి సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ మూవీ తర్వాత త్యాగరాజన్.. విజయ్ కాంత్ ప్రధాన పాత్రలో మానగర కావల్ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో తిరిగి సొంతఊరికి వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదానికి గురైన త్యాగరాజన్ కోమాలోకి వెళ్లారు. అనంతరం కోలుకున్న తర్వాత ఆయన మళ్లీ అవకాశాల కోసం చెన్నైకి తిరిగి వచ్చారు. ఈసారి కూడా అవకాశాలు రాకపోవడంతో స్థానిక వడపళణి, ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన పడుకుని అమ్మా క్యాంటీన్ లో తింటూ బతికేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం త్యాగరాజన్ కన్నుమూశారు. దీంతో పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.